India Playing XI vs Australia for 5th T20: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న టీమిండియా చివరి పోరుకు సిద్దమైంది. బెంగళూరు వేదికగా ఆదివారం జరగనున్న ఈ నామమాత్రపు పోరులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మూడో టీ20 ఓటమి నుంచి త్వరగానే తేరుకున్న టీమిండియా నాలుగో మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో విజయాన్నందుకుంది.
ఇదే ఉత్సాహంలో ఆఖరి మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ను ఘనంగా ముగించాలని భావిస్తోంది. ఈ గెలుపు ఉత్సాహంతో సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరాలనుకుంటోంది. మరోవైపు ఆసీస్ మాత్రం పరువు కోసం పాకులాడుతోంది. చివరి మ్యాచ్ గెలిచి భారత పర్యటనను విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది. బెంగళూరు మైదానం చిన్నది కావడంతో మరోసారి పరుగుల వరద అభిమానులను ముంచెత్తనుంది.

ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లను ఆడించాలనుకుంటోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే 15 మంది ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కగా మరో ఇద్దరికి మాత్రం ఒక్క అవకాశం కూడా రాలేదు. చివరి మ్యాచ్‌లో ఆ ఇద్దర్నీ కూడా ఆడించాలని వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలోని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరంటే.. పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే, స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరూ బెంచ్‌కే పరిమితమయ్యారు. పిచ్ కండిషన్స్‌తో సంబంధం లేకుండా ఈ ఇద్దర్నీ ఆడించాలనుకుంటే అక్షర్ పటేల్‌తో పాటు రవిబిష్ణోయ్‌లపై వేటు పడనుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రవి బిష్ణోయ్‌ను ఉంచాలన్నా.. లేదా అక్షర్ పటేల్‌ను కొనసాగించాలన్నా ఓ బ్యాటర్‌ను పక్కనపెట్టాల్సి ఉంటుంది.
అప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని త్యాగం చేసి వైస్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్‌కు జట్టు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇషాన్ కిషన్‌కు రెస్ట్ ఇచ్చి జితేశ్ శర్మను తీసుకున్నారు. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లను కూడా కొనసాగించే అవకాశం ఉంది. రీఎంట్రీలో దారుణంగా విఫలమైనా.. అయ్యర్‌కు మరో అవకాశం ఇవ్వనున్నారు.
విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్న రింకూ సింగ్ చోటు డోకా లేదు. గత మ్యాచ్‌లోనే బరిలోకి దిగిన దీపక్ చాహర్ చివరి మ్యాచ్ కూడా ఆడనున్నాడు. ఆవేశ్ ఖాన్‌తో పాటు ముఖేష్ కుమార్ కూడా కొనసాగనున్నాడు. అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం ఆవేశ్ ఖాన్‌పై వేటు పడనుంది.
ఆసీస్‌తో ఐదో టీ20కి భారత తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్/శివమ్ దూబే, రవి బిష్ణోయ్/వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్, దీపక్ చాహర్
ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత్ జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.