ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాలతో సిరీస్‌ను గెలుచుకుందామనుకున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసంతో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. దాంతో టీమిండియా హ్యాట్రిక్ విజయం చేజారింది.
ఈ పరాజయాన్ని మరవకముందే టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం జరగనున్న నాలుగో టీ20లో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మూడో టీ20లో ఎదురైన పరాజయానినికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్దమవుతోంది. మూడో టీ20లో చేసిన తప్పిదాలను సరిచేసుకొని విజయం సాధించడంతో పాటు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది.

మరోవైపు అసాధారణ విజయం సాధించిన ఆసీస్ అదే జోరులో నాలుగో టీ20లో గెలిచి చివరి మ్యాచ్‌ను డిసైడర్‌గా మార్చాలనుకుంటోంది. పెళ్లి కోసం ముఖేష్ కుమార్ జట్టును వీడటంతో తుది జట్టులో మార్పు చేసిన టీమిండియా మూల్యం చెల్లించుకుంది. అతని ప్లేస్‌లో బరిలోకి దిగిన ఆవేశ్ ఖాన్ ముఖేష్ కుమార్ లేని లోటు తీర్చలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో యార్కర్లతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే ముఖేష్ కుమార్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో 45 పరుగులను టీమిండియా కాపాడుకోలేకపోయింది. పెళ్లిని పూర్తి చేసుకున్న ముఖేష్ కుమార్ నాలుగో టీ20కి అందుబాటులోకి రానున్నాడు. అతను తుది జట్టులోకి వస్తే ఆవేశ్ ఖాన్‌ను పక్కనపెట్టవచ్చు. అతనికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం మూడో టీ20లో దారుణంగా విఫలమైన ప్రసిధ్ కృష్ణపై వేటు పడనుంది.

టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత్ బౌలర్‌గా ప్రసిధ్ కృష్ణ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ఈ ఒక్కటి మినహా జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు. శివమ్ దూబేను తీసుకోవాలనుకుంటే తిలక్ వర్మ బెంచ్‌కు పరిమితం కావల్సి ఉంటుంది. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించే అవకాశాలున్నాయి. టీమిండియా బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.
ముఖేష్ కుమార్ చేరికతో బౌలింగ్ పటిష్టం కానుంది. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ కూడా సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదు.
ఆసీస్‌తో మూడో టీ20కి భారత తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ/శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ/ఆవేశ్ ఖాన్
టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత్ జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.