India Playing XI: శుభ్‌మన్ గిల్‌కు మళ్లీ నిరాశే.. ఆసీస్‌తో మూడో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

హైదరాబాద్: వరుసగా రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని రిటైన్ చేసుకున్న టీమిండియా.. మరో కీలకపోరుకు సిద్దమవుతోంది. బుధవారం (మార్చి 1) ఇండోర్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో పర్యాటక ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండో టెస్ట్‌ను మూడు రోజుల్లోనే ముగించి వారం రోజులు విశ్రాంతి తీసుకున్న భారత ఆటగాళ్లు.. ఫ్రెష్‌గా ఇండోర్ టెస్ట్‌లో బరిలోకి దిగుతున్నారు. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు.

కేఎల్ రాహుల్‌కు మరో అవకాశం..
ఒకే ఒక్క మార్పుతో రెండో టెస్ట్ బరిలోకి దిగిన టీమిండియా.. అసాధారణ ప్రదర్శనతో విజయాన్నందుకుంది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌ను రెండో టెస్ట్ తుది జట్టులోకి తీసుకున్న టీమ్‌మేనేజ్‌మెంట్ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసింది. ఇక ఇండోర్ వేదికగా జరిగే మూడో టెస్ట్‌లోనూ ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పేలవ ఫామ్‌తో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్‌ను తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్నా.. కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ అండదండలు అతనికి ఉన్నాయి. అంతేకాకుండా అతని విషయంలో మాజీ క్రికెటర్లు రెండుగా విడిపోయారు. గంభీర్, ఆకాశ్ చోప్రా వంటి ఆటగాళ్లు రాహుల్‌కు అండగా నిలిస్తే.. కపిల్ దేవ్, వెంకటేశ్ ప్రసాద్ వంటి దిగ్గజాలు విమర్శలు గుప్పిస్తున్నారు.

శుభ్‌మన్ గిల్‌కు నిరాశే..
పేలవ ఫామ్ నేపథ్యంలో సెలెక్టర్లు అతనిపై వేటు వేయకుండా వైస్ కెప్టెన్సీ హోదాను అయితే తొలిగించారు. పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వరుసగా విఫలమవుతున్న రాహుల్‌ను పక్కనపెట్టి సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అయితే కోచ్ ద్రవిడ్, రాహుల్ మాత్రం అతనికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. విదేశాల్లో సెంచరీలు చేసిన ఓపెనరని వెనుకేసుకొస్తున్నారు. వారి మాటలను బట్టి చూస్తే మూడో టెస్ట్‌లోనూ రాహుల్‌కే మరో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే శుభ్‌మన్ గిల్‌కు మరోసారి నిరాశే ఎదురు కానుంది.

ఈ ఒక్క మార్పు తప్పా...
కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ మినహా తుది జట్టును మార్చాల్సిన అవసరం టీమిండియాకు లేదు. మూడో టెస్ట్‌లో కూడా రాహుల్ కొనసాగితే.. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. మిడిలార్డర్‌లో చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగుతారు. రెండో టెస్ట్‌లో అయ్యర్ విఫలమైనా.. గత రికార్డుల నేపథ్యంలో అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. ఆ తర్వాత జడేజా, కేఎస్ భరత్, అక్షర్ పటేల్ లోయర్ మిడిలార్డర్‌లో ఆడుతారు. ఒక వేళ కేఎల్ రాహుల్‌తో కీపింగ్ చేయించాలనుకుంటే కేఎస్ భరత్‌పై వేటు పడుతుంది. కానీ రెండో టెస్ట్‌లో భరత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పైగా అతనికి రాహుల్ ద్రవిడ్ అండదండలు మెండుగా ఉన్నాయి.

కుల్దీప్‌కు మళ్లీ మొండి చెయ్యే..
బౌలింగ్ విభాగంలోనూ టీమిండియా పెద్దగా మార్పులు చేసే చాన్సే లేదు. అశ్విన్, జడేజా స్పిన్ బౌలింగ్‌లో కీలకం కాగా.. అక్షర్ పటేల్ బౌలింగ్‌తో పాటు లోయరార్డర్‌లో కీలక పరుగులు చేస్తున్నాడు. దాంతో ఈ ముగ్గురిని జట్టులో తప్పకుండా కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తొలి రెండు టెస్ట్‌లకు తయారు చేసిన పిచ్‌లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇండోర్ వికెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పేస్‌కు అనుకూలమైన వికెట్ తయారు చేస్తే.. ఎక్స్‌ట్రా పేసర్‌తో టీమిండియా బరిలోకి దిగాల్సి ఉంటుంది. అప్పుడు శార్దూల్, ఉనాద్కత్‌లో ఒకరు జట్టులోకి వస్తారు. ప్రధాన పేసర్లుగా మాత్రం సిరాజ్, షమీ ఆడటం ఖాయం. మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు ఎవరైనా గాయపడితే బెంచ్ ఆటగాళ్లు తుది జట్టులోకి వస్తారు.

తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications