India Playing XI: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు!

India Playing XI vs Australia for 3rd ODI: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో చిత్తుగా ఓడిన టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. బుధవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవడంతో చెన్నై వన్డే ఫైనల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుండటంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ వన్డేలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా.. ఈ ఘోర పరాజయానికి బదులు తీర్చుకోవాలనే ప్రతీకారంతో రగిలిపోతోంది. మరోవైపు రెండో వన్డే విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆసీస్.. అదే జోరులో చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది. దాంతో చెన్నై వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జట్టులో కీలక మార్పు..
ఈ మ్యాచ్‌కు భారత జట్టు (India Playing XI) ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్ కావడం.. చెపాక్ స్టేడియం పిచ్ స్పిన్ అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు.
అతన్ని ఆడించాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తే అక్షర్ పటేల్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఈ ఒక్క స్థానానికి మించి జట్టులో మార్పులు చేసే అవకాశమే లేదు. ఎవరైనా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటే తప్పా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

సూర్యకు మరో చాన్స్..
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సూర్య విఫలమైనా.. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు జట్టులో లేడు. ఇషాన్ కిషన్‌ను ఆడించాలనుకుంటే తప్పా.. సూర్య చోటు వచ్చే డోకా అయితే లేదు. విశాఖ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కూడా సూర్యకు మరో అవకాశం ఇస్తామని హింట్ ఇచ్చాడు. 'శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు పునరాగమనం చేస్తాడో మాకు తెలియదు.
ఖాళీ ఉన్న అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఆడిస్తున్నాం. వైట్ బాల్ క్రికెట్‌లో అతని సత్తా ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. సత్తా ఉన్న ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తామని ఇప్పటికే నేను ఎన్నోసార్లు చెప్పాను'అని రోహిత్ తెలిపాడు.

బ్యాటింగ్‌లో మార్పుల్లేవ్..
తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన శుభ్‌మన్ గిల్ మూడో వన్డేలోనూ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. రోహిత్ కూడా విశాఖలో విఫలమయ్యాడు. ఈ ఇద్దరూ మంచి శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. విశాఖలో కాస్త కుదురుకున్నట్లు కనిపించిన విరాట్.. ఇన్‌స్వింగ్ డెలివరీకి ఔటయ్యాడు.
అతను కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. సూర్యకు ఇది డూఆర్‌డై మ్యాచ్. తొలి వన్డేలో జట్టును గెలిపించిన రాహుల్.. మరోసారి అలాంటి ప్రదర్శన చేయాల్సిందే. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాల్సి ఉంది.

షమీకి రెస్ట్ ఇస్తే..
బౌలింగ్ విభాగంలో కూడా పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగనుండగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్‌రౌండర్లుగా కొనసాగనున్నారు. లోకల్ బాయ్ సుందర్ ఆడించాలనుకుంటే అక్షర్ బెంచ్‌కే పరిమితమవుతాడు. ప్రధాన పేసర్లు మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగనున్నారు. షమీకి రెస్ట్ ఇవ్వాలనుకుంటే జయదేవ్ ఉనాద్కత్, ఉమ్రాన్ మాలిక్‌లో ఒకరు జట్టులోకి వస్తారు.

భారత్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ/ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications