ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ప్రారంభించిన టీమిండియా.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఐదు టెస్ట్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన భారత్.. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం సన్నాహకాలను కూడా పూర్తి చేసుకుంది. కాన్‌బెరా వేదికగా ప్రధాని ఎలెవన్‌తో జరిగిన పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమైన రోహిత్ శర్మ.. గాయంతో బెంచ్‌కే పరిమితమైన శుభ్‌మన్ గిల్ పింక్ బాల్ టెస్ట్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

మిడిలార్డర్‌లో రోహిత్..
పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్ శర్మ(3) తీవ్రంగా నిరాశపర్చగా.. శుభ్‌మన్ గిల్ మాత్రం హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లో రోహిత్ గైర్హాజరీలో సత్తా చాటిన రాహుల్‌నే ఓపెనర్‌గా కొనసాగించనున్నారు. రోహిత్ శర్మ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌తోనే ఈ విషయం అర్థమైంది.
ఆ ఇద్దరిపై వేటు..
రోహిత్, గిల్ రాకతో భారత తుది జట్టును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిత్, శుభ్‌మన్ గిల్ ఎంట్రీతో దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్‌పై వేటు పడనుంది. అడిలైడ్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో రవీంద్ర జడేజా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన వాషింగ్టన్ సుందర్‌ను తప్పిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ జడేజాను ఆడించాలనుకుంటే మాత్రం సుందర్ బెంచ్‌కు పరిమితమవుతాడు.
ఈ మూడు మార్పులు మినహా జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. భారత్ ముగ్గురు పేసర్లతో పాటు ఓ పేస్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగనుంది. హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా 6 బంతుల్లో 4 వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ భారత తుది జట్టు(అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్/రవీంద్ర జడేజా, మహహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా.