ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ప్రారంభించిన టీమిండియా.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమవుతోంది. ఐదు టెస్ట్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్.. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్ట్ కోసం సన్నాహకాలు ప్రారంభించింది.
పెర్త్ టెస్ట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టును నడిపించాడు. అటు కెప్టెన్‌గా ఇటు బౌలర్‌గా సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 8 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలిన భారత్.. ఆసీస్‌ను 104 పరుగులకే ఆలౌట్ చేసింది.

పింక్ బాల్ టెస్ట్ కోసం..
రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ శతకాలతో చెలరేగడంతో భారత్ 487/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం నమోదవ్వగా.. లక్ష్యచేధన కోసం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ జట్టు 238 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది.
ఈ విజయ ఉత్సాహాన్ని ఇలానే కొనసాగించాలని టీమిండియా భావిస్తుండగా ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ అనుకుంటోంది. డే/నైట్ జరిగే అడిలైడ్ టెస్ట్‌లో పింక్ బాల్‌తో ఆడనున్నారు. దాంతో ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతోంది. తొలి టెస్ట్‌కు దూరమైన రోహిత్ శర్మ.. ఇప్పటికే జట్టుతో కలవగా.. గాయంతో బెంచ్‌కు పరిమితమైన శుభ్‌మన్ గిల్ కూడా రెండో టెస్ట్‌కు అందుబాటులోకి రానున్నాడు.
ఆ ముగ్గురిపై వేటు..
దాంతో భారత తుది జట్టును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడిలైడ్ పిచ్‌కు తగ్గట్లు టీమిండియా తుది జట్టును ఎంపిక చేయనున్నారు. రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. మిడిలార్డర్‌లో ఆడనున్నాడు. శుభ్‌మన్ గిల్ కూడా అందుబాటులోకి వస్తే దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ బెంచ్‌కు పరిమితం కానున్నారు.
అడిలైడ్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు వాషింగ్టన్ సుందర్ ఉద్వాసనకు గురవుతాడు. ఈ మూడు మార్పులు మినహా జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. భారత్ ముగ్గురు పేసర్లతో పాటు ఓ పేస్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగనుంది.
ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ భారత తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, నితీష్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, మహహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా.