India Playing XI vs Australia for 2nd T20: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఆదివారం తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20లో పర్యాటక ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టీ20 గెలిచిన ఉత్సాహంలోనే రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని డబుల్ చేసుకోవాలనుకుంటోంది.
మరోవైపు తొలి టీ20లో ఎదురైన అనూహ్య పరాజయం నుంచి తేరుకోవాలని ఆసీస్ భావిస్తోంది. తృటిలో చేజారిన విజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. తొలి టీ20లో బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా తమ కాంబినేషన్‌లో వ్యూహాత్మక మార్పు చేయనుంది. తిరువనంతపురం పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఎక్స్‌ట్రా పేస్ ఆప్షన్‌తో బరిలోకి దిగనుంది.

స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను ఆడించే అవకాశం ఉంది. శివమ్ దూబే తుది జట్టులోకి వస్తే టీమిండియా బ్యాటింగ్ డెప్త్ పెరగనుంది. వైజాగ్ వేదికగా జరిగిన తొలి టీ20లో శివమ్ దూబే లేని లోటు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో టీమిండియా లోయరార్డర్ తడబడింది.
రింకూ సింగ్ లేకుంటే టీమిండియాకు పరాజయం ఎదురయ్యేది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన అక్షర్ పటేల్ తేలిపోయాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. దాంతోనే అతన్ని పక్కనపెట్టి శివమ్ దూబేను ఆడించే అవకాశం ఉంది. ఒకవేళ అక్షర్ పటేల్‌కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం.. రవి బిష్ణోయ్ లేదా తిలక్ వర్మ/యశస్వీ జైస్వాల్‌లో ఒకరు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లను కొనసాగించాలనుకుంటే శివమ్ దూబే కోసం ఓ బ్యాటర్‌ను పక్కనపెట్టాలి. అప్పుడు తిలక్ వర్మ, యశస్వీ జైస్వాల్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితమవుతారు. వైజాగ్ టీ20లో తిలక్ వర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దురదృష్టవశాత్తు డైమండ్ డక్ అయిన రుతురాజ్ గైక్వాడ్‌కు మరో అవకాశం దక్కనుంది. సూర్య, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం.
బౌలింగ్‌లో ముఖేష్ కుమార్ యార్కర్లతో బెంబేలెత్తిస్తున్నాడు. స్పిన్నర్లు.. ఇతర బౌలర్లు గాడిన పడితే టీమిండియాకు తిరుగుండదు. ఈ మ్యాచ్‌లో కూడా వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్‌లకు చోటు దక్కే అవకాశం లేదు.
ఆసీస్‌తో రెండో టీ20కి భారత తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్/ తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ
టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత్ జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.