ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సిద్దమైంది. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ మినీ వన్డే ప్రపంచకప్‌కు తెరలేవనుండగా.. టైటిలే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. హైబ్రిడ్ మోడల్‌లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఈ టోర్నీని నిర్వహిస్తుండగా.. భారత్ మ్యాచ్‌లు తటస్థ వేదికైన దూబాయ్‌లో జరగనున్నాయి.
గ్రూప్-లో ఉన్న భారత్.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.
జోష్‌లో టీమిండియా..
ఫిబ్రవరి 23న జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. మార్చి 2న న్యూజిలాండ్‌తో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ భారత్ సెమీస్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి. ఈ టోర్నీ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. జట్టులోని ప్రతీ ఆటగాడు ఫామ్‌లో ఉన్నాడు. పేలవ బ్యాటింగ్‌తో ఇబ్బంది పడిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా లయను అందుకున్నారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా టచ్‌లోకి రాగా.. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

బుమ్రా లేకుండానే..
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ టోర్నీకి దూరమవ్వడం ఒక్కటే టీమిండియాకు ప్రతికూలంశం. గాయం నుంచి బుమ్రా కోలుకున్నా.. బౌలింగ్ చేసే ఫిట్‌నెస్ సాధించకపోవడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ అతన్ని ఈ టోర్నీకి దూరంగా ఉంచింది. భవిష్యత్తు టోర్నీలు, మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకొని రిస్క్ తీసుకోవద్దనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుంది. బుమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు.
అదొక్కటే సమస్య..
అయితే ఈ ఇద్దరికి పెద్దగా అనుభవం లేకపోవడం టీమిండియాకు బలహీనతగా మారింది. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ జట్టులో ఉన్నా మునపటిలా బౌలింగ్ చేయకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. గాయంతో దాదాపు 15 నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్న షమీ.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తోనే భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ ఆడినా స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. కానీ అతని అనుభవం జట్టుకు బలంగా మారుతుందని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
హార్దిక్‌పైనే ఆశలు..
బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తి కోటా ఓవర్లను బౌలింగ్ చేస్తుండటం టీమిండియాకు అదనపు అడ్వాంటేజ్‌గా మారింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కొనసాగించిన కాంబినేషన్‌నే టీమిండియా మేనేజ్‌మెంట్ దాదాపు ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించే ఛాన్స్ ఉంది. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది. రెండో పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్, షమీ మధ్య పోటీ నెలకొంది. అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కు పరిమితం చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
భారత్ తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహహ్మద్ షమీ/అర్ష్‌దీప్ సింగ్.
భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా