ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 30 రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో బరిలోకి దిగే జట్ల వివరాలను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటిస్తున్నాయి. బీసీసీఐ సైతం రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా అంచనాలకు తగ్గట్లుగా బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇచ్చింది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అనంతరం గాయంతో జట్టుకు దూరమైన మహమ్మద్ షమీ.. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఫిబ్రవరి 19న పాకిస్థాన్ వేదికగా ఈ మినీ ప్రపంచకప్‌కు తెరలేవనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో తలపడనుంది. హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీ జరగుతుండగా.. భారత్ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరగనున్నాయి.
దుబాయ్ పిచ్‌లకు తగ్గట్లు టీమిండియా కాంబినేషన్ ఉండనుంది. స్పిన్‌కు అనుకూలంగా ఉండే దుబాయ్ వికెట్‌పై స్పిన్నర్లకు ప్రాదాన్యత దక్కనుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్ 2023లో ఈ ఇద్దరే జట్టుకు ఓపెనర్లుగా వ్యవహరించారు. అయితే శుభ్‌మన్ గిల్ ఫామ్ సరిగ్గా లేకపోవడంతో పాటు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ఆలోచన చేస్తే యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.
మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయనున్నాడు. గిల్, యశస్వి జైస్వాల్ ఇద్దరినీ ఆడిస్తే కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు గిల్ మూడో స్థానంలో ఆడుతాడు. అలా జరగకపోతే మాత్రం నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఆడించనున్నారు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కే తొలి ప్రాధాన్యత దక్కనుంది. అయితే ఇటీవల పంత్ సూపర్ ఫామ్‌లో ఉండటం.. లెఫ్టార్మ్ బ్యాటర్ కావడం అతనికి కలిసొచ్చే అంశం.
ఈ లెక్కన ఆలోచిస్తే పంత్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తారు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఆడనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగుతారు. అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతాడు. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలు ఆడుతారు. ఈ ఇద్దరిలో ఎవరికి ఫిట్‌నెస్ సమస్యలున్నా.. అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వస్తాడు. ముగ్గురు పేసర్లతో ఆడాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కు పరిమితమవుతాడు. అయితే దుబాయ్ పిచ్‌పై టీమిండియా ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తోనే బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ.