ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వరుస విజయాలతో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమవుతోంది. ఆదివారం(మార్చి 2) జరగబోయే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే గ్రూప్-ఏ టాపర్‌గా నిలవనుండటంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి. రెండు జట్లు బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను ఓడించి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాయి. ఇదే తరహా ప్రదర్శనను ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కొనసాగించి సగర్వంగా నాకౌట్ చేరాలనే లక్ష్యంతో ఉన్నాయి.
బలాల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నాయి. కాకపోతే దుబాయ్ వేదికగానే ఈ మ్యాచ్ జరగనుండటం టీమిండియాకు కలిసిరానుంది. ఇప్పటికే ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడి గెలిచిన భారత్‌కు దుబాయ్ పరిస్థితులు బాగా అలవాటయ్యాయి. మరోవైపు పాకిస్థాన్‌లో ఆడి వస్తున్న న్యూజిలాండ్‌కు దుబాయ్ పిచ్ కండిషన్స్‌కు అలవాటు పడేందుకు సమయం పట్టనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఇంకా 6 రోజుల సమయం ఉండటం ఇరు జట్లకు కలిసొచ్చే అంశం.

రోహిత్ శర్మ డౌట్..
ఈ మ్యాచ్‌కు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. దాంతో తమ తుది జట్టులో తప్పక మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. దాంతో అతను ఎక్కువ సేపు ఫీల్డింగ్ చేయలేదు. కంఫర్టబుల్‌గా బ్యాటింగ్ చేసినా.. అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించకుంటే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఇప్పటికే టీమిండియా సెమీఫైనల్ చేరిన నేపథ్యంలో రోహిత్‌కు రెస్ట్ ఇవ్వవచ్చు.
అదే జరిగితే శుభ్‌మన్ గిల్ జట్టును నడిపించనున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో రిషభ్ పంత్ తుది జట్టులోకి రానున్నాడు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. పంత్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. మిగతా బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఫస్ట్ డౌన్‌లో కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ బాది ఫామ్ అందుకున్నాడు. ఐదో స్థానంలో రిషభ్ పంత్ బ్యాటింగ్ చేయనుండగా.. ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా ఆడనున్నాడు. స్పిన్ విభాగంలో మార్పులు చేసే అవకాశం లేదు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగనున్నారు. దాంతో వరుణ్ చక్రవర్తీ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
మహమ్మద్ షమీ ఔట్..
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సైతం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అసౌకర్యంగా కనిపించాడు. తన చీల మండ గాయం తిరగబెట్టినట్లు అనిపించింది. దాంతోనే అతను పాక్‌తో మ్యాచ్‌లో సమర్థవంతంగా బౌలింగ్ చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే అతనికి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఫిట్‌గా ఉంటే మాత్రం బరిలోకి దిగుతాడు. దూరమైతే అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగనున్నాడు. హర్షిత్ రాణాతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఒకవేళ షమీ ఫిట్‌గా ఉంటే రాణాను తప్పించి అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించే ఛాన్స్ ఉంది.
న్యూజిలాండ్‌తో భారత తుది జట్టు(అంచనా): శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా