ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం పుణె వేదికగా జరిగే నాలుగో టీ20లో ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే 2-1తో ఈ సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది.
మరోవైపు తొలి రెండు టీ20ల్లో ఓటమిపాలైన ఇంగ్లండ్ మూడో టీ20లో మాత్రం సాధికారమైన ప్రదర్శనతో విజయాన్నందుకుంది. ఇదే స్పూర్తిని చివరి రెండు టీ20ల్లో కనబర్చి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే నాలుగో టీ20పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అర్ష్‌దీప్ సింగ్ రీఎంట్రీ..
మూడో టీ20లో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియా తప్పులపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తుది జట్టులో స్వల్ప మార్పులు చేయనుంది. గత మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టి మహమ్మద్ షమీని ఆడించగా.. అతను పెద్దగా ప్రభావం చూపలేదు. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన షమీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతని పేలవ ప్రదర్శన టీమిండియా ఓటమికి కారణమైంది.
అయితే షమీపై వేటు వేయకున్నా అతనికి తోడుగా అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించే ఛాన్స్ ఉంది. అతని కోసం స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై వేటు వేయనున్నారు. వెన్ను నొప్పితో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన రింకూ సింగ్ అందుబాటులోకి వచ్చాడు. దాంతో అతని స్థానంలో ఆడిన ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే శివమ్ దూబే జట్టులోకి వస్తాడు. మిగతా లైనప్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.
సంజూపై విమర్శలు..
ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ దారుణంగా విఫలమవుతున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో అతను ఒకే రీతిలో ఔటవ్వడం విమర్శలకు దారి తీసింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లోనే షాటి పిచ్ బాల్స్‌ను పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. నాలుగో టీ20లోనైనా అతను ఈ బలహీనతను అధిగమించాలి. అభిషేక్ శర్మ ఆడపా దడపా రాణిస్తున్నా.. భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కెప్టెన్ సూర్య ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. హార్దిక్ పాండ్యా పర్వాలేదనిపిస్తున్నాడు. మరోసారి సమష్టిగా రాణిస్తేనే భారత్‌కు విజయం దక్కుతుంది.
భారత్ తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా/ శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తీ.