సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మంగళవారం రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడో టీ20లో ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో ఏకపక్ష విజయాన్నందుకున్న టీమిండియా.. చెన్నై వేదికగా హోరాహోరీగా సాగిన రెండో టీ20లో మాత్రం తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శనతో ఓటమిని తప్పించుకుంది. ఇదే జోరులో మూడో టీ20 గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. తద్వారా బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనేది టీమిండియా మేనేజ్‌మెంట్ ఆలోచనగా తెలుస్తోంది.

సిరీస్ గెలవడమే లక్ష్యంగా..
మరోవైపు తొలి టీ20లో దారుణంగా విఫలమైన ఇంగ్లండ్ రెండో టీ20లో తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఇంగ్లండ్ సమష్టిగా రాణించింది. ఇదే జోరును మూడో టీ20లో కనబర్చి విజయంతో పాటు సిరీస్‌లో నిలవాలనుకుంటుంది. ఈ మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
రెండో టీ20లో రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. మూడో టీ20లో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. పక్కటెముకల గాయంతో నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్ మొత్తానికి దూరమవ్వగా.. వెన్ను నొప్పితో రింకూ సింగ్ మూడో టీ20కి అందుబాటులో లేడు. వీరి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ రెండో టీ20 ఆడారు. సుందర్ రాణించినా.. ధ్రువ్ జురెల్ దారుణంగా విఫలమయ్యాడు.

హార్దిక్ పాండ్యా ఔట్..
మూడో టీ20 నుంచి హార్దిక్ పాండ్యా విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేపథ్యంలో హార్దిక్ పాండ్యా వర్క్‌లోడ్‌పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అతనికి ఈ సిరీస్‌ల్లోని మిగతా మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి కల్పించే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో మరో ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
షమీకి ఛాన్స్..
రెండో టీ20లో నలుగురు స్పిన్నర్లతో ఆడిన టీమిండియా.. రాజ్‌కోట్‌లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడనుంది. రవి బిష్ణోయ్ స్థానంలో మహమ్మద్ షమీ జట్టులోకి రావచ్చు. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన షమీ.. తుది జట్టులో చోటు కోసం వేచి చూస్తున్నాడు. మూడో టీ20లో అతను బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.
ఇంగ్లండ్‌తో మూడో టీ20కి భారత తుది జట్టు(అంచనా):
సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ.