హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనను విజయంతో ప్రారంభించిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. గురువారం(జులై 20) నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌తో తలపడనుంది. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అదే జోరులో రెండో టెస్ట్‌లోనూ విజయం సాధించాలనుకుంటోంది.
మరోవైపు కనీస పోటీ ఇవ్వలేక అబాసుపాలైన వెస్టిండీస్.. రెండో టెస్ట్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. పూర్తిగా ఏకపక్షంగా సాగుతున్న ఈ సిరీస్‌ను ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. భారత ఆటగాళ్లు మాత్రం రికార్డులు కొల్లగొడుతున్నారు. సెంచరీల మోత మోగిస్తున్నారు. తొలి టెస్ట్‌లో అరంగేట్ర ప్లేయర్ యశస్వి జైస్వాల్‌తో పాటు రోహిత్ శర్మ సెంచరీలతో సత్తా చాటారు.

విరాట్ కోహ్లీ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఇక రెండో టెస్ట్‌లోనూ భారత బ్యాటర్లు సెంచరీల మోత మోగించే అవకాశం ఉంది. దాదాపు ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగనుంది. బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తే మాత్రం సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వనుంది. రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం కల్పించాలని భావిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో ఒకరు బెంచ్‌కు పరిమితం కానున్నారు.
రోహిత్ శర్మ కెప్టెన్ కనుక విరాట్ కోహ్లీకే రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. 99 శాతం టీమ్ కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వికెట్ కాస్త స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. తొలి టెస్ట్‌లోనూ స్పిన్నర్లదే హవా నడిచింది. ఈ క్రమంలో ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌ను ఆడించాలనుకుంటే జయదేవ్ ఉనాద్కత్ బెంచ్‌కు పరిమితమవుతాడు.
ఇంతకుమించి తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం టీమిండియాకు లేదు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ బరిలోకి దిగనుండగా.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు. అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కత్ లోయరార్డర్‌లో ఆడుతారు.
తొలి టెస్ట్‌లో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ తడబడినా.. అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. సిరాజ్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు.
వెస్టిండీస్‌తో రెండో టెస్ట్.. భారత్ తుది జట్టు(అంచానా)
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కత్/అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్