ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. లీడ్స్ వేదికగా మంగళవారం ముగిసిన తొలి టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి గంట వరకు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. కానీ విజయం ఇంగ్లండ్‌నే వరించింది. చెత్త ఫీల్డింగ్, లోయరార్డర్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు దాదాపు 10 క్యాచ్‌లు వదిలేసారు. బ్యాటింగ్‌లో టాపార్డర్ చెలరేగినా.. లోయారర్డర్ విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులు వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులకే ఆఖరి 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే టీమిండియా తమ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది.
జూలై2న బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌లో టీమిండియా తుది జట్టులో పలు మార్పులతో బరిలోకి దిగనుంది. ముఖ్యంగా తొలి టెస్ట్‌లో తీవ్రంగా నిరాశపర్చిన శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్‌లపై వేటు పడే అవకాశం ఉంది. పేస్ ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్.. బ్యాటింగ్(1, 2), బౌలింగ్‌లో(0/38, 2/51) దారుణంగా విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసినా.. ధారళంగా పరుగులిచ్చాడు. ముఖ్యంగా అతని బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయవకాశాలపై ప్రభావం చూపింది. బుమ్రాకు అండగా చెలరేగాల్సిన సిరాజ్(2/122, 0/51) కూడా తీవ్రంగా నిరాశపర్చాడు.

ఈ క్రమంలోనే ఈ ఇద్దరిని రెండో టెస్ట్‌కు తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆడటం ఖాయం. ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్.. బ్యాట్‌తో సత్తా చాటాడు. లోయరార్డర్‌లో విలువైన పరుగులు జోడించాడు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఓ సెంచరీ కూడా సాధించాడు. మహమ్మద్ సిరాజ్ స్థానంలో.. స్వింగ్ కింగ్ అయిన అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించవచ్చు. అయితే బుమ్రా అందుబాటులో ఉంటేనే సిరాజ్‌పై వేటు వేసే అవకాశం ఉంది. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.
ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్ బరిలోకి దిగనున్నారు. తొలి టెస్ట్‌లో ఈ ఇద్దరూ అద్భుత ప్రదర్శన కనబర్చారు. మిడిలార్డర్‌లో సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, కరుణ్ నాయర్ ఆడనున్నారు. శుభ్‌మన్, పంత్ సత్తా చాటగా.. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్(0, 20).. తీవ్రంగా నిరాశపర్చాడు. అరంగేట్ర మ్యాచ్‌లో సాయి సుదర్శన్(0, 30) సత్తా చాటలేకపోయాడు. ఈ ఇద్దరూ రెండో టెస్ట్‌లో తప్పక రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఆడనున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి వస్తే లోయరార్డర్‌లో ఈ ఇద్దరూ కీలకం కానున్నారు. తొలి టెస్ట్‌లో జడేజాకు మరో ఎండ్‌లో సహకారం లభించలేదు. అయితే బౌలింగ్‌లో జడేజా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా మూడు మ్యాచ్‌లే ఆడుతానని చెప్పాడు. ఈ క్రమంలో రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడే విషయంపై క్లారిటీ లేదు. ప్రసిధ్ కృష్ణ సైతం తీవ్రంగా నిరాశపర్చాడు. బౌలింగ్ విభాగంలోనే టీమిండియా మార్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సిరాజ్, ప్రసిధ్‌లో ఒకరిని మాత్రమే తప్పించనున్నారు. ఒకవేళ బుమ్రా అందుబాటులో ఉంటే.. ప్రసిధ్, అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.