ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 43 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీ20ల్లో ఇంగ్లండ్‌పై టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం. ఈ సిరీస్‌లో తదుపరి మ్యాచ్ శనివారం చెన్నై వేదికగా జరగనుంది.
అయితే 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీకి తొలి టీ20 తుది జట్టులో చోటివ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. షమీ మళ్లీ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించడం కోసమే షమీని తుది జట్టులోకి తీసుకోలేదని మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.

షమీ రీఎంట్రీ..
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో చివరిసారిగా ఆడిన షమీ.. మళ్లీ ఇప్పటి వరకు అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. అయితే చెన్నై వేదికగా జరిగే రెండో టీ20లో అతను బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే ఔటయ్యారు.
ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి మిడిలార్డర్‌లో కొనసాగనున్నారు.
రవిబిష్ణోయ్ ఔట్..
అయితే బౌలింగ్ విభాగంలో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. తొలి టీ20లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తీ మూడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్ పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్ సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే అతన్ని తప్పించి మహమ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
ఫస్ట్ మ్యాచ్‌లో స్పెషలిస్ట్ పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే ఆడాడు. అతనితో కలిసి హార్దిక్ పాండ్యా కొత్త బంతిని పంచుకున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా ధారళంగా పరుగులిచ్చాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 42 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే షమీని జట్టులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే 400 రోజుల తర్వాత షమీ.. టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నాడు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చాలనే ఉద్దేశం లేకుంటే మాత్రం షమీ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.