India Playing XI: ఇషాన్ ఔట్.. రాహుల్ ఇన్! వెస్టిండీస్‌తో రెండో వన్డేలో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో చారిత్రాత్మక 1000వ వన్డేలో చిరస్మరణీయ విజయాన్నందుకున్న టీమిండియా.. మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అదే అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేకు సమాయాత్తమవుతోంది. ఈ సిరీస్‌తోనే టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించాడు.
అదే జోరులో రెండో వన్డేలోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు కీరన్ పొలార్డ్ నేతృత్వంలోని వెస్టిండీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో భారత స్పిన్‌కు విలవిలలాడిన ఆ జట్టు.. ఈసారి ఆ తప్పిదాలను సరిదిద్దుకోవాలనుకుంటుంది. ఐపీఎల్ మెగా వేలానికి ముందు జరుగుతున్న మ్యాచ్ కావడంతో మెరుగైన ప్రదర్శన చేసి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాలని ఆ జట్టు ప్లేయర్లు భావిస్తున్నారు.

రాహుల్ ఇన్.. ఇషాన్ ఔట్!
ఇక ఈ మ్యాచ్‌కు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చాడు. సోదరి వివాహం కారణంగా తొలి వన్డేకు దూరంగా ఉన్న రాహుల్.. మూడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. కరోనాతో కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో బ్యాకప్ ఓపెనర్‌గా జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా ప్రాక్టీస్ షురూ చేసిండు. ఇక కేఎల్ రాహుల్ రాకతో ఫస్ట్ వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. రోహిత్ శర్మతో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఫస్ట్ వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీతో మెరిసిన రోహిత్.. అదే జోరు కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు.

మిడిలార్డర్‌లో నో చేంజేస్..
ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ రానుండగా.. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ బరిలోకి దిగనున్నాడు. తొలి వన్డేలో కోహ్లీ(8) దారుణంగా విఫలమవగా.. పంత్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ పర్వాలేదనిపించాడు. అరంగేట్ర ప్లేయర్ దీపక్ హుడా కూడా ఆకట్టుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ కరోనా బారిన పడటంతో తుది జట్టులో అతనికి ఆడే అవకాశం రాగా.. రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. మిడిలార్డర్‌లో ఏ ముగ్గురు బ్యాట్స్‌మన్ చెలరేగినా భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయం.

స్పిన్నర్లుగా చాహల్, సుంధర్..
తొలి వన్డే వెస్టిండీస్‌ను యుజ్వేంద్ర చాహల్ తన స్పిన్‌తో ముప్పు తిప్పలు పెట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. చాలా రోజుల తర్వాత విన్నింగ్ పెర్పామెన్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాటు వన్డేల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. అతనికి తోడుగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సత్తా చాటాడు. రెండు కీలక వికెట్లు తీసాడు. ఈ పెర్ఫామెన్స్‌తో రెండో వన్డేలో కూడా ఈ ఇద్దరే బరిలోకి దిగే అవకాశం ఉంది. దాంతో కుల్దీప్ యాదవ్‌కు మరోసారి నిరాశే ఎదురుకానుంది.

దీపక్ చాహర్ డౌట్..
సౌతాఫ్రికా పర్యటనలో సూపర్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో సత్తా చాటిన దీపక్ చాహర్‌కు విండీస్‌తో ఫస్ట్ వన్డేలో చోటు దక్కలేదు. అతనికి బదులు ప్రసిధ్ కృష్ణకు రోహిత్ శర్మ అవకాశం కల్పించాడు. అయితే ఈ అవకాశాన్ని ప్రసిధ్ కృష్ణ సద్వినియోగం చేసుకున్నాడు. రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక మహమ్మద్ సిరాజ్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలోనే వికెట్ తీసి టీమిండియా శుభారంభం అందించాడు. అయితే లార్డ్ శార్దూల్ ఠాకూర్ మాత్రం ఒక్క వికెట్ తీయలేకపోయాడు. కానీ పొదుపుగానే బౌలింగ్ చేశాడు. దాంతో పేస్ విభాగాన్ని రోహిత్ మార్చకపోవచ్చు. ఒకవేళ దీపక్ చాహర్‌ను ఆడించాలనుకుంటే మాత్రం శార్దూల్ బెంచ్‌కు పరిమితమవుతాడు.

భారత్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుంధర్, దీపక్ చాహర్/ శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications