India Playing XI:భువీ ఔట్.. అశ్విన్ డౌట్.. శార్దూల్‌కు చాన్స్.. పాక్‌తో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

India playing 11 for Pakistan t20 world cup match: ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ మెగా సమరం.. భారత్Xపాకిస్థాన్ బిగ్ ఫైట్‌కు సమయం ఆసన్నమైంది. అరబ్ గడ్డపై అదిరిపోయే క్రికెట్ హంగామా.. గ్రాండ్ గాలా నైట్స్‌లో.. హీటెక్కించే వేడిలో.. మోతెక్కనున్న పరుగుల ఆటకు.. ఎల్లుండే(ఆదివారం) తెరలేవనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో రాత్రి 7.30కు ఈ బిగ్ ఫైట్ ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ అంటే అటు ఇరు దేశాల అభిమానులకే కాదు యావత్ క్రీడా అభిమానులకు ఆసక్తి ఉంటుంది. దాంతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం.. ఈ హీట్‌ను మరింత పెంచుతుంది.
గెలుపును ఫ్యాన్స్ తమ దేశ ప్రతిష్టగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే మెగాటోర్నీల్లో పాక్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం కాగా.. ఆ లెక్కను సరిచేయాలనే కసితో పాక్ రగిలిపోతుంది. మరోవైపు తమకు అలవాటైన రీతిలోనే పాక్‌ను చిత్తు చేసి మెగాటోర్నీని ఘనంగా ప్రారంభించాలని భారత్ భావిస్తోంది. నిండా మ్యాచ్ విన్నర్లతో ఉన్న టీమిండియా టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా ఉన్నప్పటికీ.. పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఇప్పటికే రెండు వామప్ మ్యాచ్‌లతో తుది జట్టుపై ఓ అంచనాకు వచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్ ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉందో చూద్దాం!

ఓపెనర్లుగా రాహుల్, రోహిత్..
ఈ బిగ్ ఫైట్‌కు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బరిలోకి దిగడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనింగ్ జోడీపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. పైగా ఈ ఇద్దరూ వామప్ మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించగా.. మెగా టోర్నీలంటే చెలరేగిపోయే రోహిత్ టచ్‌లోకి వచ్చాడు. దురదృష్టవశాత్తు గాయాలైతే తప్పా ఈ జోడీలో మార్పు ఉండదు. పాక్‌పై ఈ ఇద్దరు మంచి శుభారంభం అందిస్తే భారత్‌కు తిరుగుండదు. ఇక ఫస్ట్ డౌన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రావడం ఖాయం. ఫస్ట్ వామప్ మ్యాచ్‌లో పెద్దగా రాణించని కోహ్లీ.. సెకండ్ వామప్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేదు. అయితే క్లాస్ ప్లేయర్ అయిన కోహ్లీ టచ్‌లోకి రావడం పెద్ద సమస్యే కాదు. ఒక రెండు బౌండరీలు బాదితే అతనే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించగలడు. పైగా ఇది కెప్టెన్‌గా అతనికి చివరి టీ20 ప్రపంచకప్ కావడం.. మెంటార్‌గా తన బాస్ మహేంద్ర సింగ్ ధోనీ అండ ఉండటంతో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కోహ్లీకి కావాల్సిన సమయం ఉంటుంది. కాబట్టి అతను పాత కోహ్లీలా చెలరేగే అవకాశం ఉంటుంది.

మిడిలార్డర్‌లో ఆ ముగ్గురు..
మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. ఫస్ట్ వామప్ మ్యాచ్‌లో విఫలమైన సూర్య.. ఆస్ట్రేలియాతో ఫామ్ అందుకున్నాడు. తన క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌పై చెలరేగిన రిషభ్ పంత్ సెకండ్ వామప్ మ్యాచ్ ఆడలేదు. రెండు మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ ఫినిషర్‌గా తన పాత్ర పోషించాడు. మునపటిలా ఆడలేకపోయినప్పటికీ.. ముందు ముందు చెలరేగగలడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయని హార్దిక్.. కేవలం బ్యాట్స్‌మన్‌గానే జట్టులో కొనసాగనున్నాడు. ఫినిషర్‌గా ధోనీ లేని లోటును తీర్చేందుకు సిద్దమవుతున్నాడు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తే మాత్రం సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కు పరిమితమవుతాడు. కానీ పాక్‌తో పోరంటేనే ఒత్తిడితో కూడుకున్నది కాబట్టి యువ ఆటగాడైన ఇషాన్‌ను తీసుకునే సాహసం చేయకపోవచ్చు.

ఆల్‌రౌండర్లు జడేజా, శార్దూల్..
స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా జట్టులో ఉండటం ఖాయం. పైగా అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో మెరిసాడు. ఈ మెగాటోర్నీలో కూడా బ్యాటింగ్ పరంగా అతని పాత్ర అదే. అటు బౌలింగ్‌లోనూ జడేజా కీలకం. ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం లేదు కాబట్టి మూడో పేసర్‌గా శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం దక్కనుంది. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన అతను జట్టులో ఉంటే లోయరార్డర్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ కారణంతోనే భువనేశ్వర్‌ను పక్కనపెట్టి మరీ శార్దూల్‌ను తీసుకునే చాన్స్ ఉంది. ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైనప్పటికీ శార్దూల్ ఓ మ్యాచ్ విన్నర్. కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో దిట్ట. పైగా అతనికి మెంటార్ సింగ్ ధోనీ అండ ఉంది. ధోనీ వల్లే స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న అతను జట్టులోకి వచ్చాడు. పైగా ఐపీఎల్‌లో సత్తా చాటాడు. కాబట్టి తుది జట్టులో అతనికి చోటు ఖాయం.

పేస్ త్రయమే..
మ్యాచ్ 7.30కు జరగనుంది కాబట్టి మంచు కీలక పాత్ర పోషించనుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాన పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు అవకాశం దక్కనుంది. ఫస్ట్ వామప్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు పర్వాలేదనిపించారు. అయితే భువీని తీసుకురావాలనుకుంటే మాత్రం షమీని పక్కనపెట్టవచ్చు. మరోవైపు భువనేశ్వర్ ఒకప్పటిలా సత్తా చాటలేకపోతున్నాడు. ఇంగ్లండ్‌తో సన్నాహక మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అయితే ఆస్ట్రేలియాతో మాత్రం అదరగొట్టాడు. కాబట్టి పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటేనే అతనికి చోటు దక్కనుంది. ఒక వేళ ముగ్గురు ప్రధాన పేసర్లు తీసుకోవాలనుకుంటే శార్దూల్‌కు నిరాశ తప్పదు. ఏకైక స్పిన్నర్‌గా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీని తీసుకునే చాన్స్ ఉంది. అయితే అతని ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడితే మాత్రం తుది జట్టులోకి అశ్విన్ వస్తాడు. గత వామప్ మ్యాచ్‌లో అశ్విన్ అదరగొట్టాడు.

పాక్‌తో బరిలోకి దిగే భారత తుది జట్టు(అంచనా)
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ/రవిచంద్రన్ అశ్విన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications