
ఓపెనర్లుగా రోహిత్, రాహుల్..
కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయం కాగా.. మరో ఓపెనర్ ఎవరా? అనేదానిపై గందరగోళం నెలకొన్నది. ఇటీవల గాయం నుంచి కోలుకొని జింబాబ్వే పర్యటనకు ఎంపికైన కేఎల్ రాహుల్ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతను దారుణంగా విఫలమయ్యాడు. పైగా టీమ్ దూకుడు మంత్రం జపిస్తుండగా.. రాహుల్ బ్యాటింగ్ శైలి నెమ్మదిగా ఉండటం అతను జట్టులో ఉండటంపై అనుమానాలు రేకెత్తిస్తుంది. కోహ్లీ లేదా సూర్యతో ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని, రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించే చాన్స్ ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సూర్యను ఓపెనర్‌గా ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరీ కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చేస్తాడో చూడాలి.

మిడిలార్డ్‌ర్‌లో కోహ్లీ, సూర్య, పంత్, హార్దిక్..
ఇక ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ ఆడటం ఖాయం. ఇంగ్లండ్ పర్యటన అనంతరం సుదీర్ఘ విరామం తీసుకున్న అతను పాక్‌తో మ్యాచ్‌లోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. 15 రోజుల క్రితమే ప్రాక్టీస్ షురూ చేసిన కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. కోహ్లీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. ఇటీవల అతను ఓపెనర్‌గా సత్తా చాటి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వికెట్ రీషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఐదు, ఆరో స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. ఈ ఇద్దరూ సైతం మంచి టచ్‌లో ఉన్నారు.

దినేశ్ కార్తీక్ డౌట్..
ఐపీఎల్ 2022 సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో చిరస్మరణీయ విజయాలందించి ఫినిషర్ రోల్‌కి తానే సరైనవాడినని చాటి చెప్పాడు. అయితే జట్టులో నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా అతను ఆడటం అనుమానంగా మారింది. ఆరో బౌలింగ్ ఆఫ్షన్ కావాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తే.. దినేశ్ కార్తీక్‌కు బదులు దీపక్ హుడా లేదా రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోనున్నారు. బ్యాటింగ్ విభాగం బలంగా ఉండాలనుకుంటే దీపక్ హుడా.. స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలనుకుంటే అశ్విన్ జట్టులోకి వస్తాడు. హుడా ఆడితే మిడిలార్డర్‌లో అశ్విన్ ఆడితే ఏనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఈ ఇద్దర్ని కాదని యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని ఆడించవచ్చు.

భువీ సారథ్యంలో..
స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా చోటుకు డోకా లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ ఆడటం ఖాయం. ఇక పేస్ బాధ్యతలను భువనేశ్వర్ కుమార్‌కు అండగా అర్షదీప్ సింగ్‌ను తీసుకుంటారు. పేస్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం వీరికి అండగా నాలుగు ఓవర్లు పూర్తి చేస్తాడు. ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకుంటే ఒక స్పిన్నర్‌ను తగ్గించి ఆవేశ్ ఖాన్ సేవలను వాడుకోవచ్చు. అయితే దుబాయ్ పిచ్‌లు నెమ్మదిగా ఉంటాయి కాబట్టి ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది.

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్/దీపక్ హుడా/రవిచంద్రన్ అశ్విన్/రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్


Click it and Unblock the Notifications












