India Playing XI: దీపక్, సిరాజ్‌కు చాన్స్.. భువీ, అశ్విన్ డౌట్! న్యూజిలాండ్‌తో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2021లో చెత్తాటతో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టిన టీమిండియా.. సొంతగడ్డపై మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా జైపూర్ వేదికగా బుధవారం ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ అనంతరం టీ20 కెప్టెన్సీ బాధ్యతలనుంచి విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోవడంతో నయా సారథిగా రోహిత్ శర్మ, కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌లను బీసీసీఐ నియమించింది.
ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ.. ఇండియా-ఏ, అండర్-19 కోచ్‌గా తనదైన ముద్ర వేసిన రాహుల్ ద్రవిడ్ కాంబినేషన్‌లో టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్ టైటిలే లక్ష్యంగా సన్నాహకాలు ప్రారంభించనుంది. ఈ సుదీర్ఘ ప్రయాణానికి రేపటి మ్యాచ్‌తో తెరలేవనుంది. దాంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందుగా టీమ్ కాంబినేషన్‌ను సెట్ చేయాలనుకుంటున్న ద్రవిడ్, రోహిత్.. న్యూజిలాండ్‌తో ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతారో చూడాలి. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే తుది జట్టుపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా రాహుల్, రోహిత్..
ఇక ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలనే కొనసాగించనుంది. టీ20 ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌ల్లో ఈ జోడీ దారుణంగా విఫలమైనప్పటికీ.. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో దుమ్మురేపింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో పనికూన జట్లకు భారత్ సత్తా ఏంటో చూపించింది. దాదాపు ఈ ఓపెనింగ్ కాంబినేషన్‌ను విడదీయడానికి ప్రయత్నంచారు. అయితే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో మిడిలార్డర్‌లో అనుభవం కలిగిన ఆటగాడిని ఆడించాలనుకుంటే మాత్రం రాహుల్‌ను మూడో స్థానంలోకి దించవచ్చు. అంతేకాకుండా సుదీర్ఘ ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా సిద్దం చేయాలని భావించినా అతనితో రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు.

మిడిలార్డర్‌లో..
ఒకవేళ ఇవేం ప్రయోగాలు చేయకుండా ఉంటే మాత్రం ఫస్ట్ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడవచ్చు. రాహుల్ మిడిలార్డర్‌లోకి వస్తే అయ్యర్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇషాన్ కిషన్‌ను ఆడించాలనుకున్నా.. అయ్యర్‌పైనే వేటు పడుతుంది. సూర్యకుమార్ యాదవ్‌ను పక్కనపెట్టే సాహసం రోహిత్ చేయకపోవచ్చు. దాదాపు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు అతను ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. కానీ దానికి ద్రవిడ్ ఆమోదం కూడా అవసరమే. ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ఆడటం ఖాయం.

ఆల్‌రౌండర్లుగా అయ్యర్..
ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా స్థానాన్ని వెంకటేశ్ అయ్యర్ భర్తీ చేయడం ఖాయం. ఐపీఎల్‌లో అయ్యర్ రాణించిన విషయం తెలిసిందే. హార్థిక్ పాండ్యాలా అతన్ని తీర్చిదిద్దాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించిన రవీంద్ర జడేజా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. స్పిన్ ఆల్‌రౌండర్లు అయిన అశ్విన్, అక్షర్ పటేల్‌లో ఒకరికి అవకాశం దక్కుతుందా? లేక బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన హర్షల్ పటేల్‌కు అవకాశం కల్పిస్తారా? అనేది చూడాలి. అయితే భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి.. స్పిన్ ఆల్‌రౌండర్‌నే తీసుకోవచ్చు. రవిచంద్రన్ అశ్విన్‌కే రోహిత్ శర్మ ఓటేయవచ్చు.

దీపక్ చాహర్, సిరాజ్..
ఇక పేసర్లుగా దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్‌లను ఆడించే అవకాశం ఉంది. అయితే సీనియర్ పేసర్ అయిన భువనేశ్వర్ కుమార్‌ను తీసుకోవాలనుకుంటే దీపక్ చాహర్ బెంచ్‌కే పరిమితమవుతాడు. ఎందుకంటే ఈ ఇద్దరి బౌలింగ్ శైలి ఒక్కటే. ఇక ఐపీఎల్‌లో సత్తా చాటిన హర్షల్ పటేల్‌కు చోటిస్తారా? లేదా? అనేది చూడాలి. ఒకవేళ తీసుకుంటే మాత్రం సిరాజ్ బెంచ్‌కు పరిమితం అవుతాడు. ఆవేశ్ ఖాన్ ఆడటం మాత్రం ఖాయమనిపిస్తోంది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే మాత్రం అతని చోటుకు కూడా ముప్పే ఉంటుంది. ఏకైక స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ ఆడటం ఖాయం. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికచేయకుండా ఎంత తప్పిదం చేశామో సెలెక్టర్లకు తెలిసొచ్చింది.

భారత్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్/అక్షర్ పటేల్, దీపక్ చాహర్/భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్/హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications