IND vs ENG: రహానే ఔట్.. రోహిత్ శర్మ డౌట్.. ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

హైదరాబాద్: 50 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఓవల్ మైదానంలో భారత జట్టు అద్భుత విజయాన్నందుకుంది. సోమవారం ముగిసిన నాలుగో టెస్ట్‌లో 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. విపత్కర పరిస్థితులను దాటుకుంటూ.. ప్రత్యర్థి పేస్ పరీక్షను తట్టుకుంటూ.. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌కు దిమ్మదిరిగే షాక్‌లిస్తూ కోహ్లీసేన జయకేతనం ఎగురవేసింది. దాంతో అచ్చిరాని మైదానంలోనే అసాధారణ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచి సేఫ్‌గా ఉంది.
తాడో పేడో తేల్చుకోవాల్సిన పనిలేదు. ఒత్తిడిలో బరిలోకి దిగాల్సిన అవసరం పడదు. ఇంకో మ్యాచ్ మిగిలున్నా... ఈ సిరీస్ ఎక్కడికీ పోదు. ఆఖరి టెస్టు డ్రా చేసుకుంటే చాలు! ఐదు టెస్టుల సిరీస్ కోహ్లీ సేనకే ఖాయమవుతుంది. ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ శుక్రవారం నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది. ప్రస్తుతం ఈ విజయ ఉత్సాహంలో ఉన్న భారత్.. రెండో రోజుల విరామం తర్వాత ఆఖరి టెస్ట్ కోసం సన్నాహకాలు ప్రారంభించనుంది. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆటగాళ్లు ఆఖరిపోరులో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనున్నారు.
రోహిత్ శర్మ డౌట్..
ఇక చివరి టెస్ట్‌లో బరిలోకి దిగే భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఓవల్ సెంచరీ హీరో, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. నాలుగో టెస్ట్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. 353 నిమిషాలపాటు క్రీజులో నిలుచున్న రోహిత్ శర్మ తొడలు ఎర్రగా కమిలిపొయాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో థై ప్యాడ్స్ రాసుకోవడం.. ఇంగ్లండ్ బౌలర్ల బంతులు బలంగా తాకడంతో రెండు తొడలకు గాయాలయ్యాయి. అయితే ఈ గాయం తీవ్రత గురించి తెలియకపోయినప్పటికీ.. హిట్ మ్యాన్ చివరి రెండు రోజులు ఫీల్డింగ్ చేయలేదు. ముందస్తు చర్యల్లో భాగంగానే అతనికి విశ్రాంతి ఇవ్వచ్చు. ఒకవేళ రోహిత్ గాయం తీవ్రమైతే అతను ఆఖరి టెస్ట్‌కు దూరం కావచ్చు. అదే జరిగితే పృథ్వీ షా/మయాంక్ అగర్వాల్‌లో ఒకరు జట్టులోకి వస్తారు.

రహానే ఔట్..
వరుసగా విఫలమవుతున్న రహానేపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సిరీస్ మొత్తంలో రహానే ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 107 పరుగులు చేసాడు. ఇందులో లార్డ్స్ టెస్ట్‌లో హాఫ్ సెంచరీ మినహా ఏది చెప్పుకొదగ్గ ప్రదర్శన లేదు. వాస్తవానికి ఆస్ట్రేలియా పర్యటనలో మెల్ బోర్న్ టెస్ట్ సెంచరీ తర్వాత రహానే మళ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. తన నిలకడలేమి ఆటతో జట్టుకు భారంగా మారాడు. ఈ క్రమంలోనే రహానేను తీసేయాలని మాజీ క్రికెటర్లు కూడా విమర్శిస్తున్నారు. అయితే విన్నింగ్ టీమ్‌ను మార్చడానికి మాములుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇష్టపడడు. మరీ రహానే విషయంలో ఏం చేస్తాడో చూడాలి. ఒకవేళ రహానే దూరమైతే మాత్రం హనుమ విహారీ, సూర్యకుమార్ యాదవ్‌లో ఒకరికి అవకాశం దక్కుతుంది.

పుజారా కూడా డౌటే..
హాఫ్ సెంచరీతో రాణించిన టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా కూడా గాయపడ్డాడు. రోహిత్ శర్మతో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పిన పుజారా.. వికెట్ల మధ్య పరుగులు తీసే సమయంలో అతని మడమ మడత పడింది. ఆ నొప్పితోనే ఆటను కొనసాగించాడు. పెయిన్ కిల్లర్‌ను తీసుకుంటూ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీ రోల్ పోషించాడు. ఈ గాయం కారణంగానే పుజారా కూడా చివరి రెండు రోజులు ఫీల్డింగ్ చేయలేదు. అతని గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చివరి టెస్ట్‌లో అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అదే జరిగితే టెస్ట్ టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారీ, సూర్యకుమార్ యాదవ్‌లో ఒకరు బరిలోకి దిగడం ఖాయం. రహానే కూడా దూరమైతే ఈ ఇద్దరు బరిలో ఉంటారు. పుజారా దూరమైతే రహానేను పక్కనపెట్టే సాహసం కోహ్లీ చేయకపోవచ్చు.

అశ్విన్‌కు నిరాశే..
పుజారా దూరమైతే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్చసే అవకాశం ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేస్తే నాలుగో స్థానంలో వస్తాడు. రహానే కూడా దూరమైతే అతని స్థానంలో హనుమ విహారి ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. ఆ తర్వాత రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌లతో లోయరార్డర్ పటిష్టంగా ఉంది. మరోసారి రవిచంద్రన్ అశ్విన్‌కు నిరాశ తప్పేలా లేదు. మాంచెస్టర్ పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్ వ్యూహంతోనే కోహ్లీసేన బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ అశ్విన్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం జడేజాను పక్కనపెట్టవచ్చు.

సిరాజ్‌కు రెస్ట్..
జస్‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని పేస్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. బుమ్రా, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్‌లతోనే ఆఖరి టెస్ట్‌లో బరిలోకి దిగవచ్చు. అయితే మహమ్మద్ షమీ గాయం నుంచి కోలుకుంటే.. వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న సిరాజ్‌కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అంతేతప్పా జట్టులో పెద్దగా మార్పులు ఉండవు.

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ/పృథ్వీషా, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా/సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే/హనుమ విహారి, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా/అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిరాజ్/మహమ్మద్ షమీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications