Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: పాక్ కెప్టెన్ కూతురితో భారత క్రికెటర్ల ఆట.. వైరల్ వీడియో!

India Players Share Heartwarming Moment With Pakistan Skipper Bismah Maroofs Daughter After WC Match

మౌంట్‌ మాంగనూయి: మహిళల వన్డే ప్రపంచకప్‌‌ను టీమిండియా ఘన విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి.. తమ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ సేన 107 పరుగుల భారీ తేడాతో విజయాన్నందుకుంది. అయితే ఈ గెలుపు కంటే మ్యాచ్ అనంతరం భారత అమ్మాయిలు చేసిన పనే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో పాటు అభిమానులు, మాజీ క్రికెటర్లు భారత అమ్మాయిలు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. విజయానంతరం అసలు భారత అమ్మాయిలు ఏం చేశారంటే.. పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా మారుఫ్ కూతురు‌తో ఆడుకున్నారు.

ఓవైపు తల్లిగా..

తన కూతురు ఫాతిమాను తీసుకుని మారుఫ్ ప్రపంచకప్‌ ఆడేందుకు వచ్చింది. ఓ వైపు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు కెప్టెన్‌గా మైదానంలో జట్టును నడిపిస్తున్న మారూఫ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. పాకిస్థాన్‌పై విజయం తర్వాత భారత అమ్మాయిలందరూ ఆ చిన్నారితో ఆడుకున్నారు. ఆ చిన్నారి ముఖాన్ని చూస్తూ నవ్వులు చిందించారు. ఆమెతో సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తల్లీకూతుళ్లతో టీమిండియా క్రికెటర్లు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్‌, పాక్‌ జట్లను చూసి క్రికెట్‌ స్ఫూర్తిని నేర్చుకోవడమే ఫాతిమా మొదటి పాఠమంటూ ఈ ఫొటోను ఐసీసీ ట్వీట్‌ చేసింది. అభిమానులు కూడా భారత అమ్మాయిలను కొనియాడుతున్నారు. అసలు సిసలు క్రీడా స్పూర్తి ఇదేనంటూ మెచ్చుకుంటున్నారు.

గతేడాదే తల్లి అయిన బిస్మా..

బిస్మా మరూఫ్ గతేడాది ఆగస్టులో ఫాతిమాకు జన్మనిచ్చింది. ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఫాతిమాను కూడా తీసుకువెళ్లేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) బిస్మా మరూఫ్‌కు అనుమతి ఇచ్చింది. చేతిలో పాపను ఎత్తుకుని స్టేడియంకు వచ్చిన బిస్మా మరూఫ్ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భుజానికి క్రికెట్ కిట్ వేసుకుని, చేతిలో బిడ్డను ఎత్తుకుని, పాపను కూర్చోబెట్టే తోపుడు బండితో పాటు ఉన్న ఫొటోను భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఐసీసీ ట్వీట్ చేసింది. ఇక తల్లి అయిన ఏడాదిలోపే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో జట్టును నడిపించడం గొప్ప విశేషమని క్రికెట్ విశ్లేషకుు బిస్మాను మెచ్చుకుంటున్నారు.

చెలరేగిన పూజా, స్నేహ్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(75 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 52, లోయరార్డర్ బ్యాటర్స్ పూజా వస్త్రాకర్(48 బంతుల్లో 4 ఫోర్లతో 53 నాటౌట్), స్నేహ్ రానా(59 బంతుల్లో 8 ఫోర్లతో 67), హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీప్తి శర్మ(40) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(9), హర్మన్ ప్రీత్ కౌర్(5), షెఫాలీ వర్మ(0) తీవ్రంగా నిరాశపరిచారు. పాకిస్థాన్ బౌలర్లలో డయానా బైగ్, అనమ్ అమిన్, ఫాతిమా సనా తలో వికెట్ పడగొట్టగా.. నిదాదర్, నష్రా సంధు రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 43 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ జట్టులో ఓపెనర్ సిద్రా అమీన్(64 బంతుల్లో 3 ఫోర్లతో 30), డియన బైగ్(35 బంతుల్లో 2 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వడ్ (4/31) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జూలన్ గోస్వామి(2/26), స్నేహ్ రాణా(2/27) రెండేసి వికెట్లు పడగొట్టారు.

టాపార్డర్ మెరుగుపడాలి..

ఆల్‌రౌండర్ల అద్భుత ప్రదర్శన కారణంగానే ఈ మ్యాచ్‌లో విజయం సాధించామని భారత కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఆల్‌రౌండర్లే తమ జట్టు బలమని, టాపార్డర్ బ్యాటర్లు ఇంకా మెరుగుపడాల్సి ఉందని తెలిపింది. రాబోయే రోజుల్లో ఈ సమస్యను అధిగమిస్తామని చెప్పుకొచ్చింది.

బౌలింగ్, బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యామని పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ తెలిపింది. తాము తొలుత బాగానే బౌలింగ్ చేశామని, అయితే కొన్ని లూజ్ బాల్స్ వేయడం వల్ల మ్యాచ్ చేజారిందని అభిప్రాయపడింది. భారత జట్టుపై తాము ఒత్తిడి కొనసాగించలేకపోయామని, మధ్యలో పరుగులు ధారళంగా ఇచ్చుకున్నామని పేర్కొంది. తమ బ్యాటింగ్ కూడా మెరుగుపడాల్సి ఉందని, తమ లోపాలన్నింటినీ రాబోయే మ్యాచ్‌ నాటికి మెరుగుపర్చుకుంటామని చెప్పుకొచ్చింది.

Story first published: Monday, March 7, 2022, 9:35 [IST]
Other articles published on Mar 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+