India Palying XI vs SA for 1st ODI: సౌతాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్‌ను 1-1తో ముగించిన టీమిండియా వన్డే ఫార్మాట్ ఆడేందుకు సిద్దమైంది. టీ20 ఆడిన ఆటగాళ్లలో కొంతమందికి ఈ పర్యటన నుంచి విశ్రాంతినిచ్చారు. టీ20ల్లో భారత్‌ను నడిపించిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌తో పాటు రవి బిష్ణోయ్, జితేశ్ శర్మలకు ఈ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు.
దాంతో ఈ సిరీస్‌లో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. టెస్ట్ సిరీస్ నేపథ్యంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పర్యవేక్షణలో రాహుల్ సేన ఈ వన్డే సిరీస్ ఆడే అవకాశాలు ఉన్నాయి. జట్టులో కొత్త ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చాలా రోజుల తర్వాత టీమిండియా పిలుపును అందుకున్న వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్.. ఈ సిరీస్‌తో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. సంజూతో పాటు యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు.
జోహన్నెస్ బర్గ్ వేదికగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్‌లో తెలుగు తేజం తిలక్ వర్మ, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నారు.
ఐదో స్థానంలో వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. ఆరో స్థానంలో నయా హిట్టర్ రింకూ సింగ్ ఆడనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. యుజ్వేంద్ర చాహల్‌ను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టాల్సి ఉంటుంది. కానీ చివరి టీ20లో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
పేసర్లుగా ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా దీపక్ చాహర్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆకాశ్ దీప్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. దాంతో ఆవేశ్ ఖాన్‌నకు మార్గం సుగుమమైంది. టీ20లు ఆడిన తిలక్ వర్మ, రింకూ సింగ్‌లను పక్కనపెట్టాలనుకుంటే.. సాయి సుదర్శన్, రజత్ పటీదార్ తుది జట్టులోకి వస్తారు.
తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్
భారత వన్డే జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్.