
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా అధికారికంగా నిష్క్రమించడంతో టీఆర్‌పీ రేటింగ్స్, హాట్ స్టార్ వ్యూస్ దారుణంగా పడిపోయాయి. టోర్నీ ఆరంభంలోనే పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో భారత్ చిత్తుగా ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ దారుణ పరాజయాలతో అభిమానులు టీ20 ప్రపంచకప్‌పై ఆసక్తి చూపించడం తగ్గించారు. అయితే ఆ తర్వాత అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్‌పై టీమిండియా చెలరేగడంతో అభిమానుల్లో ఆశలు రేకెత్తాయి. టీఆర్‌పీ రేటింగ్స్ కొద్దిగా మెరుగయ్యాయి. ఇక భారత్ సెమీ ఫైనల్ చేరాలంటే.. న్యూజిలాండ్‌ను అఫ్గాన్ ఓడించాల్సిన పరిస్థితి రావడంతో ఫ్యాన్స్ అంతా ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా చూశారు.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ను హాట్‌స్టార్‌లో 30-40 లక్షల మంది చూశారు. మ్యాచ్ ఆరంభంలో ఈ సంఖ్య 40 లక్షలు కూడా ధాటింది. కానీ బ్యాటింగ్‌లో అఫ్గాన్ దారుణంగా విఫలమవ్వడం.. న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యమే నమోదు అవడంతో ఆశలు వదులుకున్న భారత అభిమానులు టీవీలు, ఫోన్లు పక్కనపడేసారు. దాంతో సెకండ్ ఇన్నింగ్స్ టైమ్‌లో హాట్ స్టార్ వ్యూస్ సంఖ్య 5 లక్షల లోపు పడిపోయింది. టీఆర్‌పీ రేటింగ్స్ అయితే మరి దారుణంగా పడిపోయానని టీవీ వర్గాలు పేర్కొన్నాయి.
భారీ ధర వెచ్చించి బ్రాడ్ కాస్ట్ హక్కులు దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్.. టీ20 ప్రపంచకప్‌తో ఆ డబ్బులన్నిటీని రాబట్టాలని ప్లాన్ చేసింది. కానీ టీమిండియా వైఫల్యం స్టార్ మేనేజ్‌మెంట్ కొంపముంచుతుంది. నేడు నమీబియాతో జరిగే నామమాత్రపు మ్యాచ్‌ను కూడా పెద్దగా ఎవరూ చూసే అవకాశం లేదు. దాంతో ఈ మ్యాచ్‌ల నేపథ్యంలో వచ్చే అడ్వర్టైజ్‌మెంట్స్ కోసం తీసుకున్న డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని, లేదా రేటు తగ్గించాలని ఆయా కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు 5 సెకన్ల యాడ్‌కు రూ.25 నుంచి రూ.30 లక్షలు తీసుకున్న స్టార్ స్పోర్ట్స్.. టోర్నీలో భారత్ ఆడే అన్నీ మ్యాచ్‌లకు భారీగానే ఒప్పందాలు చేసుకుంది. కానీ భారత వైఫల్యం ఇప్పుడు ఇవన్నిటిపై ప్రభావం చూపనుంది.
ఐపీఎల్ ఫైనల్లో రికార్డు స్థాయి వ్యూస్ రాబట్టిన స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌తో తమ పంట పండించుకుంది. ఈ మ్యాచ్‌ను ఒక్క హాట్‌స్టార్‌లోనే కోటీ నుంచి కోటీ యాబై లక్షల మంది వీక్షించారు. అయితే 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీస్‌ను 25.3 మిలియన్ల మంది వీక్షించారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికంగా ఉంది. అయితే పాక్‌తో మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. సెమీస్ చేరినా ఈ రికార్డు కనుమరుగయ్యేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక భారత్ లేని నాకౌట్ మ్యాచ్‌లు కళ తప్పనున్నాయి. 2007 వన్డే ప్రపంచకప్ మాదిరి సాదా సీదాగా టోర్నీ ముగియనుంది. ముఖ్యంగా క్రికెట్‌ను మతంలా భావించే భారత అభిమానులను మెగా టోర్నీ మిస్సవ్వనుంది. భారత్ సెమీస్ రేసులో లేకపోవడంతో ఆతిథ్య బీసీసీఐతో పాటు ఐసీసీకి భారీ నష్టాలు తప్పేలా లేవు.