India ODI Squad vs SA:పండుగ తెల్లారే మ్యాచ్.. ఇంకా జట్టును ప్రకటించని బీసీసీఐ!

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనున్న భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. దసరా పండుగ తెల్లారే గురువారం(అక్టోబర్ 6న) లక్నో వేదికగా తొలి వన్డే జరగనుంది. అయితే ఈ మూడు వన్డేల సిరీస్‌కు టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన ఆటగాళ్లు దూరం కానున్నారు. అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న మెగాటోర్నీ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఫ్లైట్ ఎక్కనుంది. పెర్త్ వేదికగా మెగాటోర్నీ కోసం సన్నదమవనుంది. పాకిస్థాన్‌తో అక్టోబర్ 23న జరిగే తొలి మ్యాచ్‌కు ముందు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసమే అక్టోబర్ 5నే ఆస్ట్రేలియా బయల్దేరనుంది.

రేపే లక్నోకు పయనం..
ఈ క్రమంలోనే సౌతాఫ్రికా అక్టోబర్ 6 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ.. శిఖర్ ధావన్ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. సౌతాఫ్రికాతో నేడు జరిగే రెండో టీ20 అనంతరం ఈ జట్టును ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం వన్డే సిరీస్ ఆడే జట్టు సోమవారం తొలి వన్డేకు వేదిక అయిన లక్నోకు చేరుకోనుంది. ఈ జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించనుండగా.. సంజూ శాంసన్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.

తిలక్ వర్మకు చాన్స్..
ఇటీవల న్యూజిలాండ్ ఏ జట్టుతో జరిగిన అనధికారిక సిరీస్‌ను సంజూ శాంసన్ సారథ్యంలోని భారత్-ఏ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ జట్టులో ఆడినవారికే సౌతాఫ్రికాతో ఆడే వన్డే సిరీస్‌లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ, ఐపీఎల్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ఏతో సత్తా చాటిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు కూడా అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అతను ఈ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు.

మహమ్మద్ షమీ కూడా..
కరోనా నుంచి కోలుకున్న వరల్డ్ కప్ స్టాండ్ బై ప్లేయర్ మహహ్మద్ షమీని కూడా వన్డే సిరీస్ ఆడించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. కీలక ప్రపంచకప్ ముందు అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ లభించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను గాయంతో జట్టుకు దూరమైన నేపథ్యంలో షమీని జట్టులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అతనికి బ్యాకప్‌గా మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లను స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో చేర్చింది. అయితే ప్రపంచకప్‌కు ముందు వామప్ మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో షమీని ఆస్ట్రేలియాకే పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్..
మ్యాచ్‌కు ఇంకా రెండు రోజులే పెట్టుకొని జట్టును ప్రకటించకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌పై ఫోకస్ పెట్టిన బీసీసీఐ.. ఈ సిరీస్‌ను లైట్ తీసుకుందని కామెంట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ వన్డే సిరీస్ ఎందుకు ప్లాన్ చేశారని మండిపడుతున్నారు. ద్వితీయ శ్రేణి జట్టే ఆడుతున్నప్పుడు ముందుగా ప్రకటిస్తే వచ్చే సమస్య ఏంటని నిలదీస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications