టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా ఓ మ్యాచ్‌లో తొలిసారి 1000 పరుగులు చేసింది. ఈ ఘనతను అందుకున్న 6వ జట్టుగా నిలిచింది. అంతేకాకుండా 19 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించిన తొలి జట్టుగానూ రికార్డ్ సాధించింది. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా 1014 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 427/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ(269) సాధించిన శుభ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం(161)తో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 430 పరుగులు చేసిన గిల్.. రెండు టెస్ట్‌ల్లో కలిపి 585 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లోనే టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 1014 పరుగులు చేయడం ద్వారా తమ రికార్డ్‌ను మెరుగుపరుచుకుంది. 2004 సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 916 పరుగులు చేసింది. ఇప్పటి వరకు టీమిండియాకు ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఇదే రికార్డ్ కాగా.. తాజా మ్యాచ్‌తో అధిగమించింది.

148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 6 సార్లు మాత్రమే 1000 ప్లస్ రన్స్ నమోదు అయ్యాయి. ఐదు జట్లు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. 1930లో ఇంగ్లండ్, 1934, 1969లో ఆస్ట్రేలియా, 2006లో పాకిస్థాన్, 1939లో సౌతాఫ్రికాతో భారత్ ఈ ఘనతను అందుకున్నాయి.
ఈ జాబితాలో 1,121 పరుగులతో ఇంగ్లండ్ టాప్‌లో ఉంది. 1930లో కింగ్‌స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈ ఫీట్ సాధించింది. ఆ తర్వాత పాకిస్థాన్ 1078 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఫైసలాబాద్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఈ రికార్డ్ నమోదు చేసింది. 1934లో ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 1028 పరుగులు చేసింది. 1969లో సిడ్నీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 1000 పరుగుల మార్క్ అందుకుంది. 1939లో డర్బన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 1011 పరుగులు చేసింది.
1121- ఇంగ్లండ్ vs వెస్టిండీస్, కింగ్‌స్టన్ 1930
1078- పాకిస్థాన్ vs భారత్, ఫైసలాబాద్ 2006
1028- ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్, ఓవల్ 1934
1014- భారత్ vs ఇంగ్లండ్, ఎడ్జ్‌బాస్టన్, 2025
1013- ఆస్ట్రేలియా vs వెస్టిండీస్, సిడ్నీ, 1968/69
1011- సౌతాఫ్రికా vs ఇంగ్లండ్, డర్బన్, 1938/39
ఓ టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో 1849 పరుగులు చేసిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో నలుగురు భారత బ్యాటర్లు శతకాలు సాధించగా.. పంత్ రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముందు భారత్ 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే నాలుగో ఇన్నింగ్స్‌లో నమోదైన రెండో అత్యధిక టార్గెట్‌గా ఇది నిలిచింది.