India vs New Zealand: డ్రాతో విజయమే కాదు కీలక డబ్ల్యూటీసీ పాయింట్లు చేజారాయి!

కాన్పూర్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ ఫలితం తేలకుండా ముగిసింది. చివరి రోజు ఆటలో న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేయడంలో విఫలమైన భారత్ వికెట్ దూరంలో విజయాన్ని చేజార్చుకుంది. 8.4 ఓవర్లలో చివరి వికెట్ తీయలేక డ్రాతో సరిపెట్టుకుంది. అయితే సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో విజయంతో పాటు కీలక డబ్ల్యూటీసీ పాయింట్లను భారత్ చేజార్చుకుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే 12 పాయింట్లు ఖాతాలో చేరేవి. కానీ డ్రా అవ్వడంతో ఇరు జట్ల ఖాతాలో చెరో 4 పాయింట్లు చేరాయి. ఈ చాంపియన్ షిప్‌లో భాగంగా ఆయా జట్లు స్వదేశంలో కొన్ని విదేశాల్లో మరికొన్ని మ్యాచ్‌లు ఆడుతాయనే విషయం తెలిసిందే.
కీలక పాయింట్లు..
అయితే స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు మార్గం సుగుమం అవుతుంది. మనకు అనుకూలమైన పరిస్థితుల్లో విజయాలు సాధించనప్పుడు.. విదేశాల్లో ప్రతికూలమైన పరిస్థితుల్లో గెవడం కష్టం. కాబట్టి సొంతగడ్డపై గెలవడానికి జట్లన్నీ ప్రయత్నిస్తాయి. ఫస్ట్ ఎడిషన్ చాంపియన్‌షిప్‌లో సొంతగడ్డపై విజయాలు సాధించడం భారత్‌కు కలిసొచ్చింది. దాంతో ఈ మ్యాచ్ డ్రా చేసుకున్నా భారత్ ఓడిపోయినట్లే లెక్క అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తాజా మ్యాచ్‌తో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది.

శ్రీలంక టాపర్..
కాగా తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ను సొంతం చేసుకున్న విలియమ్సన్ సేనకు.. 2021-23 ఎడిషన్‌లో ఇదే తొలి మ్యాచ్ అన్న సంగతి తెలిసిందే. భారత్ విషయానికొస్తే... ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడిన కోహ్లీ సేన.. ప్రస్తుతం స్వదేశంలో కివీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఇక స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు గెలిచిన శ్రీలంక(12 పాయింట్లు) ప్రథమ స్థానం ఆక్రమించింది. లంక తర్వాతి స్థానంలో భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఉన్నాయి. ఇక 2021-23 ఎడిషన్‌లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా సిరీస్‌లోని మ్యాచ్‌లతో సంబంధం లేకుండా గెలిచిన ప్రతీ మ్యాచ్‌కు ఐసీసీ 12 పాయింట్లు, టై అయితే 6, డ్రా అయితే 4 పాయింట్లు కేటాయిస్తుంది.

మనోళ్లే అడ్డుకున్నారు..
ఈ మ్యాచ్‌లో చివరి క్షణం వరకు పోరాడిన భారత్.. విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది. భారత సంతతికి చెందిన ఆజాజ్ పటేల్(23 బంతుల్లో 2 నాటౌట్), రాచిన్ రవీంద్ర(91 బంతుల్లో 18 నాటౌట్) అడ్డుగోడలా నిలబడటంతో భారత విజయం చేజారింది. 4/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ ఆఖరి రోజు ఆట ముగిసేసమయానికి 98 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిని తప్పించుకుంది. బ్యాడ్ లైట్ కారణంగా మరో 8 నిమిషాల ముందే అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేసారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 3 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications