ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా దుమ్మురేపుతోంది. గత మూడు ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టే విజేతగా నిలిచింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23, వన్డే ప్రపంచకప్ 2023, అండర్ 19 ప్రపంచకప్ 2023 మూడు టోర్నీల్లోనూ అసాధారణ ప్రదర్శనతో టైటిళ్లు అందుకుంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మూడు టోర్నీల్లోనూ భారత్ రన్నరప్‌గా నిలిచింది.
ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా లేకుంటే ఈ మూడు టైటిళ్లను టీమిండియానే సొంతం చేసుకునేది. ఈ మూడు ప్రతిష్టాత్మక టోర్నీల్లో భారత్ విజయానికి ఆసీస్ అడ్డుగా నిలిచింది. సీనియర్ స్థాయిలో అయినా.. జూనియర్ టోర్నీలో అయినా టీమిండియాకు ఆసీస్ కొరకరాని కొయ్యగా మారింది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆసీస్ టీమ్ దూకుడు ముందు తేలిపోయిన టీమిండియా.. సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరింది. లీగ్ దశలో ఆసీస్‌ను చిత్తు చేసింది. కానీ కీలక ఫైనల్లో మాత్రం ఆసీస్‌ను ఓడించలేక రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇదే ఫలితం పునరావృతం అయ్యింది.
అసాధారణ ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన భారత్.. బౌలింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శనే చేసింది. అంతేకాకుండా ఈ టోర్నీలో ఆసీస్‌పై భారత్‌దే పై చేయి కావడం.. గతంలో జరిగిన 2012, 2018 ఫైనల్లో ఆ జట్టును ఓడించడంతో ఉదయ్ సహారన్ సేనకు తిరుగుండదని అంతా అనుకున్నారు. కానీ సీనియర్ టీమ్ తరహాలోనే చెలరేగిన ఆసీస్ యువ టీమ్.. భారత్‌కు ఊహించని షాకిచ్చింది.
సీనియర్లు లాగే ఛాంపియన్ మనస్తత్వాన్ని చాటారు. మాటలతో కవ్విస్తూ.. మైండ్ గేమ్‌తో భారత బ్యాటర్లను బోల్తా కొట్టించారు. మూడు టోర్నీల ఫైనల్లో భారత్.. ఆసీస్ చేతిలోనే ఓడిపోవడంపై అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. మూడు టోర్నీల్లో నిరాశకు గురైన భారత ఆటగాళ్ల ఫొటోలను షేర్ చేస్తూ.. అయ్యో రామ.. ఇదెక్కడి గోస! అంటూ కామెంట్ చేస్తున్నారు.