ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఆఖరి సమరానికి సిద్దమైంది. గురువారం నుంచి లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ప్రారంభమయ్యే చివరి టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో 2-1తో వెనుకంజలో ఉన్న టీమిండియా.. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది.
మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌ను అద్భుత పోరాటంతో డ్రా చేసుకున్న టీమిండియా రెట్టించిన ఆత్మ విశ్వాసంతో ఉంది. ఆఖరి పోరులోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ గంభీర్‌తో వాగ్వాదానికి దిగి అగ్గిని రాజేసాడు. దాంతో ఆఖరి సమరంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం, కవ్వింపులు తొలి రోజు ఆట నుంచే మొదలయ్యే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. దాంతో తుది జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. ఇప్పటికే కుడి కాలి చిటికెన వేలు ఫ్రాక్చర్‌తో రిషభ్ పంత్ జట్టుకు దూరమయ్యాడు. జస్‌ప్రీత్ బుమ్రా చీల మండ గాయంతో పాటు వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఆకాష్ దీప్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. వరుసగా నాలుగు టెస్ట్‌లు ఆడిన మహమ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడు టెస్ట్‌లు మాత్రమే ఆడుతానన్న బుమ్రా.. ఆఖరి మ్యాచ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. సిరాజ్‌కు రెస్ట్ ఇస్తారా? కొనసాగిస్తారా? అనేది చూడాలి.
ఈ మ్యాచ్‌కు టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగో టెస్ట్‌లో స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుత శతకాలతో రాణించారు. ఈ ఇద్దరితో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఆడించే అవకాశం ఉంది. నాలుగో టెస్ట్‌లో విఫలమైన శార్దూల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఓవల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు. ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆట సాగే కొద్దీ బౌలింగ్‌కు అనుకూలంగా మారుతోంది.
ముఖ్యంగా నాలుగో, ఐదో రోజు ఆటల్లో అనూహ్యమైన బౌన్స్ ఉండటంతో పాటు స్పిన్‌కు అనుకూలిస్తోంది. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్‌ను బరిలోకి దించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ విశ్లేషకులు సైతం శార్దూల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని సూచిస్తున్నారు. అయితే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే పేసర్లపై ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు ఒక్క పేసర్ గాయపడినా.. పరిస్థితులు సంక్లిష్టంగా మారుతాయి.
టెస్ట్ క్రికెట్ అరంగేట్రం కోసం వేచి చూస్తున్న అర్ష్‌దీప్ సింగ్ కల ఆఖరి మ్యాచ్‌తో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. నాలుగో టెస్ట్‌కు దూరమైన ఆకాష్ దీప్ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అన్షుల్ కాంబోజ్‌పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిరాజ్‌కు రెస్ట్ ఇస్తే మాత్రం అన్షుల్ కొనసాగుతాడు. బ్యాటింగ్ విభాగంలో పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఆడనున్నాడు. ఈ ఒక్కటి మినహా పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్(కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.