
చెన్నై: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్‌లో టీమిండియా మళ్లీ దుమ్మురేపింది. ఇంగ్లండ్‌తో మంగళవారం ముగిసిన రెండో టెస్ట్‌లో 317 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకున్న కోహ్లీసేన డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగు నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఫస్ట్ టెస్ట్‌లో గెలిచి ఇంగ్లండ్ టాప్‌లోకి వెళ్లగా.. తాజా పరాజయంతో మళ్లీ నాలుగోస్తానికి పడిపోయింది. దాంతో ఫైనల్ బెర్త్ రేసు ఆసక్తికరంగా మారుతోంది. ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా పర్యటనను రద్దు చేసుకోవడంతో ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
మరో బెర్త్ కోసం భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య పోటీ నెలకొంది. ఈ సిరీస్‌ను టీమిండియా 3-1 లేదా 2-1తో గెలిచినా ఫైనల్‌కు వెళ్తుంది. అదే ఇంగ్లండ్ ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు టెస్టులు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ సిరీస్ డ్రా అయితే ఈ రెండు టీమ్స్ కాకుండా ఆస్ట్రేలియా ఫైనల్‌కు వెళ్తుంది. ఈ సమీకరణాలతో ఐసీసీ తొలిసారిగా ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు చాలా ఆసక్తికరంగా మారింది.
ఫస్ట్ టెస్ట్‌కు ముందు టాప్‌లో ఉన్న కోహ్లీ సేన.. 227 పరుగుల భారీ పరాజయంతో ఒక్క సారిగా నాలుగో స్థానానికి పడిపోయింది. దాంతో భారత్‌కు ఫైనల్ బెర్త్ దక్కుతుందా? లేదా అనే సందేహం వ్యక్తమైంది. కానీ నేలకు కొట్టిన బంతిలా టీమిండియా విజృంభించడంతో ఇంగ్లండ్ చిత్తయింది. ఈ గెలుపుతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ అవకాశాలను సజీవం చేసుకుంది. వాస్తవానికి పాయింట్స్ ప్రకారం భారత్ టాప్‌లో ఉన్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో చాలా సిరీస్‌లు రద్దవ్వడంతో ఐసీసీ విన్నింగ్ పర్సంటేజ్ రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం భారత్ 69.7 పీసీటీతో రెండో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 70.0 పీటీసీతో అగ్రస్థానంలో ఉంది.
ఇక సెకండ్ టెస్ట్ విషయానికి వస్తే.. భారత్ అద్భుత విజయాన్నందుకుంది. అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో భారీ ఓటమి చవిచూసింది. 482 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో విజృంభించిన.. అక్షర్ (5/60), అశ్విన్ (3/53) మరోసారి చెలరేగారు. దీంతో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 53/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు మంగళవారం ఆట మొదలెట్టిన ఇంగ్లండ్ మరో 111 పరుగులు చేసి చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి.