సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్యలు తీసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా స్లో ఓవర్‌రేట్‌కు కారణమైంది. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. దాంతో రూల్స్ ప్రకారం సర్కిల్ బయట ఒక ఫీల్డర్ లేకుండానే ఆటను కొనసాగించింది. తాజాగా ఈ తప్పిదంపై ఐసీసీ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంది. భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
'డిసెంబర్ 3న రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్‌కు కారణమైన టీమిండియా ఆటగాళ్లకు జరిమానా విధించాం. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత కోసాం. సమయ తగ్గింపులను పరిగణలోకి తీసుకున్న తర్వాత భారత్ నిర్ణీత సమయం కంటే రెండు ఓవర్లు తక్కువగా వేసింది. ఈ తప్పిదాన్ని భారత వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ అంగీకరించారు. దాంతో తదుపరి విచారణ లేకుండానే ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫీ రిచీ రిచర్డ్‌సన్ భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత కోస్తూ చర్యలు తీసుకున్నారు.

ఐసీసీ రూల్స్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే.. ఓవర్‌కు 5 శాతం చొప్పున జరిమానా విధిస్తారు. ఈ లెక్కన భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది. ఫీల్డ్ అంపైర్లు రాడ్ టక్కర్, రోహన్ పండిట్, థర్డ్ అంపైర్ సామ్, ఫోర్త్ అంపైర్ జయరామన్ ఫిర్యాదు మేరకు మ్యాచ్ రిఫరీ ఈ చర్యలు తీసుకున్నారు. ఈ సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. రెండో వన్డేలో ఓడినా.. ఆఖరి మ్యాచ్ గెలిచి భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు.