World Test Championship: ఆసీస్ తరహాలో ఇంగ్లండ్‌ను చిత్తు చేస్తే భారత్‌కు ఫైనల్ బెర్త్!

న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ తుది అంకానికి చేరుకుంది. మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ చాంపియన్ షిప్‌లో ఫైనల్‌కు చేరేందుకు టాప్ టీమ్స్ పోటీపడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను 2-1తేడాతో నెగ్గిన టీమిండియా చాంపియన్‌షిప్ పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ నాలుగు జట్లకే టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరుకునే అవకాశాలు ఉండగా.. భారత్‌కు పరిస్థితులు మరీ అనుకూలంగా ఉన్నాయి.

ఇంగ్లండ్‌ను చిత్తు చేస్తే..
ఆస్ట్రేలియా గబ్బా కోటలను బద్దలుకొట్టి చారిత్రక విజయాన్నందుకున్న టీమిండియా చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 71.67 విజయాల శాతంతో పాటు 430 పాయింట్లను ఖాతాలో వేసుకొని మొదటి ర్యాంకులో కొనసాగుతోంది. మరో 75 పాయింట్లు సాధించి టీమిండియా 505 పాయింట్లకు చేరుకుంటే సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా సిరీస్‌తో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఆ పాయింట్లు సాధించాలంటే టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో (టెస్ట్ చాంపియన్ షిప్‌లో భారత్ చివరి సిరీస్) విజయం సాధించాలి. గెలవడమే కాదు ఇంగ్లండ్‌ను 4-0, 3-0, 3-1 లేదా 2-0తో ఓడించాలి.

సౌతాఫ్రికాను ఓడిస్తేనే..
సొంతగడ్డపై భారత్ చేతిలో సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా సిరీస్‌కు ముందు ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం ఆసీస్ 69.16 విజయాల శాతంతో 332 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. ఒకవేళ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ రద్దయి, టీమిండియాపై ఇంగ్లండ్ ఓడితే ఆస్ట్రేలియా మూడో స్థానంతో సరిపెట్టుకుని ఫైనల్స్ నుంచి నిష్క్రమిస్తుంది. ఆస్ట్రేలియా ఫైనల్‌కు అర్హత సాధించాలంటే మాత్రం సౌతాఫ్రికాను 3-0 లేదా 2-0 తేడాతో ఓడించాలి.

భారత్‌ను ఓడిస్తేనే..
ప్రస్తుతం ఇంగ్లాండ్ 65.2 విజయాల శాతంతో 352 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే శ్రీలంకతో జరిగే చివరి టెస్టును గెలిచి.. తర్వాత భారత్‌తో సిరీస్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ స్వదేశంలో భారత్‌కు మంచి రికార్డుంది. గత ఎనిమిదేళ్లలో భారత్ సొంత గడ్డపై ఒకే ఒక టెస్టు ఓడిపోయింది.

అలా జరిగితేనే..
ఇప్పటికే ఐదు సిరీస్‌లు పూర్తి చేసుకున్న న్యూజిలాండ్ ప్రస్తుతం 70 విజయాల శాతం, 420 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన కివీస్ ఏడు గెలిచి నాలుగింటిలో ఓడింది. ఒకవేళ ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాపై గెలిచి, టీమిండియా.. ఇంగ్లండ్‌ను ఓడిస్తే కివీస్ ఫైనల్స్ నుంచి వైదొలుగుతుంది.
వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications