సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ముందు 549 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. 26/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా 78.3 ఓవర్లలో 260/5 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 288 పరుగులు కలుపుకొని మొత్తం 548 పరుగుల ఆధిక్యం సాధించింది.
సఫారీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(180 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 94) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. టోనీ డీ జోర్జీ(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఒక్కడే(4/62) నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్(1/67) ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెనరన్ ముత్తుసామి(206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109) సెంచరీ సాధించగా.. మార్కో జాన్సెన్(91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 93) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(58), వాషింగ్టన్ సుందర్(48) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. మార్కో జాన్సెన్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి తప్పించుకోవాలంటే ఈ రోజు మిగిలిన 20 ఓవర్లతో పాటు ఆఖరి రోజు పూర్తిగా బ్యాటింగ్ చేయాలి. లేదంటే ఘోర పరాజయాన్ని భారత్ మూటగట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ డ్రా అయినా సిరీస్‌ను ఆ జట్టే కైవసం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే భారత జట్టుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 549 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసి ఈ మ్యాచ్ గెలిచినట్టేనని నిట్టూరుస్తున్నారు. టెస్ట్‌ల్లో టీమిండియా మరో ఘోర పరాజయం తప్పేలా లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 489 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 201 ఆలౌట్
సౌతాఫ్రికా 260/5 డిక్లేర్డ్