సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌటైంది. దాంతో 30 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిన పిచ్‌పై భారత బ్యాటర్లు తేలిపోయారు. కేఎల్ రాహుల్(119 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39), వాషింగ్టన్ సుందర్(82 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రిషభ్ పంత్(45 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27), రవీంద్ర జడేజా(45 బంతుల్లో 3 ఫోర్లతో 27) పర్వలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(3/35), సిమన్ హర్మర్(4/30) భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ చెరో వికెట్ పడగొట్టారు.
37/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై ఓవర్‌నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్(39), వాషింగ్టన్ సుందర్(29) ఆచితూచి ఆడారు. జిడ్డు బ్యాటింగ్‌తో సఫారీ బౌలర్లను విసిగించారు. కాసేపటికి గేర్ మార్చిన సుందర్.. ఓ సిక్స్, రెండు బౌండరీలతో ఎదురు దాడికి దిగాడు. కానీ అతన్ని సిమన్ హర్మర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా.. ఆచితూచి ఆడిన కేఎల్ రాహుల్‌ను కేశవ్ మహరాజ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దూకుడుగా ఆడిన పంత్‌ను బోష్ షార్ట్ పిచ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన జురెల్ బౌండరీ బాదడంతో 138/4 స్కోర్‌తో భారత్ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

రెండో సెషన్‌లో సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో 51 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లు కోల్పోయింది. 3 ఫోర్లతో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన ధ్రువ్ జురెల్(14)ను హర్మర్ ఔట్ చేయగా.. ఆ కాసేపటికే అతని బౌలింగ్‌లో జడేజా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్(16) పోరాడే ప్రయత్నం చేసినా.. మరో ఎండ్‌లో కుల్దీప్ యాదవ్(1), మహమ్మద్ సిరాజ్(1) వెను వెంటనే పెవిలియన్ చేరారు. దాంతో బుమ్రా(1 నాటౌట్) సాయంతో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్(16) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రిటైర్డ్ హర్ట్‌గా బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు రాకపోవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారత్ స్వల్ప ఆధిక్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆలౌటైంది. ఎయిడెన్ మార్క్‌రమ్(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 31), వియాన్ మల్డర్(51 బంతుల్లో 3 ఫోర్లతో 24), ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 4 ఫోర్లతో 23), టోనీ డీ జోర్జి(55 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/27) ఐదు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించగా.. మహమ్మద్ సిరాజ్(2/47), కుల్దీప్ యాదవ్(2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.