
న్యూఢిల్లీ: టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా వయసులో చిన్నవాడైన పెద్ద మనసు చాటుకున్నాడు. నిసర్గ తుపాను ధాటికి గూడు చెదిరిన పేదలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇళ్లకు మరమ్మత్తు చేయించాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా మహారాష్ట్రలోన మాంద్వా సమీపంలోని ధోకవాడే గ్రామంలో చిక్కుకుపోయిన ఈ ముంబై సెన్సేషన్.. ఆ రాష్ట శివసేన ఎమ్మెల్యే సంజయ్ పొత్నిస్ ఫామ్‌హౌస్‌లో ఉంటున్నాడు.
ఇక తుఫాను దాటికి రోడ్డున పడ్డ ఆ గ్రామంలోని పేదలకు సంజయ్ కుమారుడు యష్‌తో కలిసి పృథ్వీషా ఆర్థిక సాయం చేశాడని మిడ్‌డే వెబ్‌సైట్ పేర్కొంది. ఎమ్మెల్యే సంజయే ఈ విషయాన్ని వెల్లడించినట్లు స్పష్టం చేసింది. 'అవును.. వారు( పృథ్వీషా, యష్) పేద ప్రజలకు సాయం చేశారు. లాక్‌డౌన్ కారణంగా అలిబాగ్‌లోనే ఉండిపోయారు. అక్కడ తుపాను ప్రభావం ఎక్కువుంది.
ఆ రాకాసి ధాటికి ఊరు మొత్తం కకావిలకమైంది. ఇళ్ల పైకప్పులను ధ్వంసమయ్యాయి. బంగ్లాలు కూడా దెబ్బతిన్నాయి. ఇదంతా పృథ్వీ, నా కొడుకు ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. గూడు చెదిరిన పేదలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. దెబ్బతిన్న ఇళ్లకు మరమత్తులు చేయించారు. ఆర్థికంగా చితికిపోయిన వారికి అండగా నిలిచారు.'అని సంజయ్ చెప్పుకొచ్చారు.
ఓవైపు కరోనా వైరస్.. మరోవైపు నిసర్గ తుపానుతో మహారాష్ట్ర అతలాకుతలమైంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్యం లక్షకు ధాటగా.. 5వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక నెల ప్రారంభంలో వచ్చిన నిసర్గ తుపానుతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక ఫామ్‌హౌస్‌లోనే పృథ్వీ షా తన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు.