
కోల్‌కతా: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభావానికి భారత్ మూడింతలు బదులు తీర్చుకుంది. సొంతగడ్డపై జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన రోహిత్ సేన 73 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీకి.. లోయరార్డర్ దీపక్ చాహర్(8 బంతుల్లో 21), హర్షల్ పటేల్(10 బంతుల్లో 18) మెరుపులు మెరిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, లూకీ ఫెర్గూసన్, ఇష్ సోదీ తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్.. 17.2 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి చిత్తుగా ఓడింది. మార్టిన్ గప్టిల్(36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. చాహల్, వెంకటేశ్, దీపక్ తలో వికెట్ దక్కించుకున్నారు.
185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ధాటిగా ప్రారంభించింది. ఫస్ట్ ఓవర్‌లోనే బౌండరీ బాదిన గప్టిల్.. దీపక్ చాహర్ వేసిన సెకండ్ ఓవర్‌లో ఓ భారీ సిక్స్‌ర్‌తో పాటు బౌండరీ బాదాడు. డారిల్ మిచెల్ సైతం ఓ బౌండరీ కొట్టడంతో 16 రన్స్ వచ్చాయి. అయితే ఈ ఓవర్ చివరి బంతికి గప్టిల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను దీపక్ చాహర్ నేలపాలు చేశాడు. ఇక మూడో ఓవర్‌లోనే స్పిన్నర్ అక్షర్ పేటేల్‌ను తీసుకొచ్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫలితాన్ని రాబట్టాడు. అతని ఫస్ట్ బాల్‌కే డారిల్ మిచెల్ క్యాచ్ ఔట్‌గా.. చివరి బంతికి డేంజరస్ చాప్‌మన్(0) స్టంపౌట్ వెనుదిరిగాడు. ఆ తర్వాత యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో గప్టిల్ భారీ సిక్సర్ బాదినా.. అక్షర్ పటేల్ తన మరుసటి ఓవర్‌లో ఫిలిప్స్‌ను ఔట్ చేశాడు. దాంతో కివీస్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 37 పరుగులు మాత్రమే చేసింది.
ఇక చాహల్ వేసిన 9వ ఓవర్‌లో గప్టిల్ సిక్స్, ఫోర్ బాదగా.. సీఫెర్ట్ ఓ బౌండరీ రాబట్టడంతో 16 పరుగులు వచ్చాయి. అక్షర్ పటేల్ వేసిన మరుసటి ఓవర్‌లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నగప్టిల్.. చాహల్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ వికెట్‌తో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పేకమేడల్లా కూలింది. మరుసటి ఓవర్‌లోనే టీమ్ సీఫర్ట్ రనౌటవ్వగా.. హర్షల్ పటేల్ ఓవర్‌లో జిమ్మీ నీషమ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సాంట్నర్(2), మిల్నే(7), ఇష్ సోదీ(9) వెనువెంటనే పెవిలియన్ చేరగా.. చివర్లో ఫెర్గూసన్ బారీ సిక్సర్లు బాదాడు. చివరకు దీపక్ చాహర్ బౌలింగ్‌లో రిట్నర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో న్యూజిలాండ్ పోరాటం ముగిసి భారత్ విజయ లాంఛనమైంది.