ఆస్ట్రేలియాతో తొలి రెండు టీ20లకు అర్ష్‌దీప్ సింగ్‌ను ఎందుకు పక్కనపెట్టామో అతనికి అర్థమైందని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2026 కాంబినేషన్ కోసం ప్రయోగాలు చేస్తున్నామని, ఈ క్రమంలోనే అతనికి అవకాశం దక్కలేదని వివరణ ఇచ్చాడు.
ఈ విషయాన్ని అర్ష్‌దీప్ సింగ్ అర్థం చేసుకున్నాడని చెప్పాడు. మూడో టీ20లో రీఎంట్రీ ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. గురువారం గోల్డ్ కోస్ట్ వేదికగా నాలుగో టీ20 జరగనున్న నేపథ్యంలో మోర్నీ మోర్కెల్ బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కనపెట్టడంపై క్లారిటీ ఇచ్చాడు.

'అర్ష్‌దీప్ సింగ్ చాలా అనుభవం కలిగిన బౌలర్. మా ప్రయోగాల గురించి
అతను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అతను ఒక ప్రపంచ స్థాయి బౌలర్. పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్. జట్టుకు అతని విలువ ఏంటో మాకు తెలుసు. అయితే ఈ పర్యటనలో మేం వివిధ కాంబినేషన్లను ప్రయత్నించాం.
జట్టు ఎంపిక టీమ్‌మేనేజ్‌మెంట్‌తో పాటు ఆటగాళ్లకు సవాలే. టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట విభిన్నమైన కాంబినేషన్స్‌ను ప్రయత్నించాలనుకుంటున్నాం. దీంతో ఆటగాళ్లు తమకు అవకాశం రాలేదని నిరాశకు గురవ్వడం సహజమే. కానీ, మేనేజ్‌మెంట్ మరోలా ఆలోచిస్తుంది. ఆటగాళ్లను ఇంకా శ్రమించేలా ప్రోత్సహిస్తాం. ఎప్పుడూ అవకాశం వచ్చినా అత్యుత్తమ ఆటతీరు కనబర్చేలా సన్నద్ధం చేస్తాం.
వచ్చే పొట్టి కప్‌లోగా చాలా తక్కువ మ్యాచ్‌లనే ఆడాల్సి ఉంటుంది. ఒత్తిడి సమయాల్లో ఆటగాళ్లు ఎలా రాణిస్తారనేది పరీక్షించాం. వారి సత్తాపై మాకు ఎలాంటి సందేహం లేదు. మ్యాచ్‌లను ఎలా గెలవాలనే దానిపైనే వర్కౌట్ చేస్తున్నాం.'అని మోర్నీ మోర్కెల్ వెల్లడించాడు. నితీష్ కుమార్ రెడ్డి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, నాలుగో టీ20లో బరిలోకి దిగుతాడని మోర్కెల్ తెలిపాడు.