టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయానికి సంబంధించి అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం గిల్ ఎలాంటి నొప్పి లేకుండా నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడని చెప్పాడు. తొలి టెస్ట్‌కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా శుభ్‌మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే.
బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి.. అతని ఎడమ చేతి బొటనవేలికి బలంగా తాకడంతో ఫ్రాక్చర్ అయ్యింది. దాంతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌కు గిల్ దూరమయ్యాడు. ఈ గాయం కారణంగా గత 10 రోజులుగా గిల్ బ్యాట్ పట్టలేదు. తొలి టెస్ట్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్ట్‌కు సమయాత్తమవుతోంది.

ఈ పింక్ బాల్ మ్యాచ్‌కు ముందు శని, ఆదివారం(నవంబర్ 30, డిసెంబర్ 1) ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో రెండు రోజుల వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో బ్యాటింగ్ చేశాడు. వామప్ మ్యాచ్ నేపథ్యంలో అభిషేక్ నాయర్.. శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా గిల్ గాయానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
'ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతని గాయాన్ని మా ఫిజియో టీమ్ పర్యవేక్షిస్తోంది. అతని గాయం స్థితి గురించి నాకు తెలియదు. కానీ బ్యాటింగ్ చేసే సమయంలో మాత్రం గిల్ కంఫర్ట్‌గా కనిపించాడు. ఇండోర్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. రేపు అతను ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతాడా లేదా? అనేది తర్వాత నిర్ణయిస్తాం.'అని అభిషేక్ నాయర్ చెప్పుకొచ్చాడు.
శుక్రవారం జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో గిల్.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అండర్ ఆర్మ్ బంతులను ఆడాడు. అడిలైడ్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్ట్‌తో గిల్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు రెండో సంతాన సమయాన్ని ఆస్వాదించేందుకు తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పింక్ బాల్ టెస్ట్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రోహిత్, గిల్ గైర్హాజరీలో దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. కానీ ఈ ఇద్దరూ తీవ్రంగా నిరాశపరిచారు. గిల్, రోహిత్ అందుబాటులోకి రావడంతో పడిక్కల్, ధ్రువ్ జురెల్ బెంచ్‌కు పరిమితం కానున్నారు.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 150 పరుగులకే కుప్పకూలింది. అనంతరం జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 104 పరుగులకే ఆలౌటైంది.
46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ శతకాలతో 487/6 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. కానీ ఆసీస్ 238 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.