ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. చెత్త ఫీల్డింగ్, లోయరార్డర్ వైఫల్యంతో గెలిచే మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ శతకాలతో పాటు రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు సాధించాడు. అయినా భారత్‌కు ఓటమి తప్పలేదు. అయితే ఈ ఓటమితో టీమిండియా ఓ చెత్త రికార్డ్‌ను తమ పేరిట లిఖించుకుంది. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లోనే ఐదుగురు బ్యాటర్లు సెంచరీ చేసిన తర్వాత ఓడిన జట్టుగా భారత్ నిలిచింది.
ఈ జాబితాలో భారత్ తర్వాత ఆస్ట్రేలియా ఉంది. 1928లో మెల్ బోర్న్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు నాలుగు సెంచరీలు నమోదు చేసినా ఓటమిపాలైంది. టెస్ట్ క్రికెట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన తర్వాత ఓడిన నాలుగో జట్టుగా కూడా టీమిండియా అప్రతిష్టను మూటగట్టుకుంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి భారత్ 839 పరుగులు చేసింది. గతంలో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 759 పరుగులు చేసి కూడా ఓటమిపాలైంది. ఈ జాబితాలో 861(ఆస్ట్రేలియా-లీడ్స్) పరుగులతో ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత పాకిస్థాన్(847-ఇంగ్లండ్, రావల్పిండి), న్యూజిలాండ్(837-ఇంగ్లండ్, నాటింగ్‌హోమ్) భారత్ కంటే ముందున్నాయి.టెస్ట్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు నమోదు చేసిన తర్వాత ఓటమి ఎదుర్కొన్న 12వ ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(101), శుభ్‌మన్ గిల్(147), రిషభ్ పంత్(134) సెంచరీలతో రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 364 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(247 బంతుల్లో 18 ఫోర్లతో 137), రిషభ్ పంత్(140 బంతుల్లో15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118) సెంచరీలతో రాణించారు. దాంతో ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసి గెలుపొందింది. బెన్ డకెట్(170 బంతుల్లో 21 ఫోర్లు, సిక్స్‌తో 149) సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(126 బంతుల్లో 7 ఫోర్లతో 65), జోరూట్(84 బంతుల్లో 6 ఫోర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.