టాలీవుడ్ టాప్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తెలిపాడు. జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరేట్ తెలుగు హీరోనని స్పష్టం చేశాడు. ఖాళీ సమయంలో ఎన్టీఆర్ సినిమాలు చూస్తానని, అతను నటించిన RRR సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పాడు.
దేశవాళీ క్రికెట్‌లో అసాధారణ ప్రదర్శనతో మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు. తిలక్ వర్మ గాయంతో జట్టుకు దూరమవడంతో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్.. ఈ అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు.
తొలి టీ20లో విఫలమైనా రెండో మ్యాచ్‌లో 76 పరుగులతో చెలరేగి భారత్‌కు అద్భుత విజయాన్నందించాడు. మూడో టీ20లో 28 బంతుల క్విక్ ఫైర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చిన్న గాయంతో నాలుగో టీ20కి దూరమైనా.. ఆఖరి మ్యాచ్‌లో సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు.
తనదైన బ్యాటింగ్‌తో సంజూ శాంసన్ చోటుకు ఎసరు పెట్టాడు. తిలక్ వర్మ రీఎంట్రీ ఇస్తే సంజూపై వేటు పడనుంది. బ్యాకప్ ఓపెనర్ కమ్ వికెట్ కీపర్‌గా భారత టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో చోటు దక్కించుకొని అసాధారణ ప్రదర్శనతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న ఇషాన్ కిషన్.. తెలుగు అభిమానులకు సుపరిచితమే. మైదానం బయట కూడా జోవియల్‌గా ఉండే ఇషాన్ కిషన్.. తన తీట పనులతో సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు అలరిస్తుంటాడు. సినిమా, క్రికెట్ అంటే పడిచచ్చే మన తెలుగు ఫ్యాన్స్.. ఇషాన్ కిషన్ ఫేవరేట్ తెలుగు హీరో గురించి తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు.

అయితే మూడేళ్ల క్రితం(2023) న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఇషాన్ కిషన్.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓ చిట్‌చాట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని ఇషాన్ కిషన్ వెల్లడించాడు. ఎన్టీఆర్ నటించిన RRR సినిమా అద్భుతంగా ఉందని, అందులోని నాటు నాటు పాటకు ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు అమోఘమని ప్రశంసల జల్లు కురిపించాడు.
న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌కు ముందు ఇషాన్ కిషన్‌తో పాటు భారత క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఆయన నివాసంలో కలిసారు. ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోలను ఇషాన్ కిషన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 'ది లెజెండ్. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది బ్రదర్. మీ సక్సెస్‌కు అభినందనలు' అని ఎన్టీఆర్‌తో ఉన్న ఫొటోను ట్వీట్ చేశాడు.
ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తెలుగు సినిమాలు, హీరోల గురించి ఇషాన్ కిషన్ ఎక్కువగా మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ బిర్యాని అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఇషాన్ కిషన్.. ఇక్కడికి వచ్చిన ప్రతీసారి తింటానని తెలిపాడు.