ఎమర్జింగ్ ఆసియాకప్ 2024లో భాగంగా పాకిస్థాన్ షాహిన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ -ఏ 184 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), అభిషేక్ శర్మ(22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) ధాటిగా ఆడటంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసింది.
పాకిస్థాన్ షాహిన్స్ బౌలర్లలో మహమ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, అరఫత్ మిన్‌హాస్, కాసిమ్ అక్రమ్ తలో వికెట్ తీయగా.. సుఫియన్ ముఖీమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఏకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రభుసిమ్రాన్ సింగ్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.

దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టారు. దాంతో పవర్ ప్లేలోనే భారత్-ఏ వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. ఆ వెంటనే దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మను సుఫియన్ ముఖీమ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఈ పరిస్థితుల్లో నెహాల్ వధేరాతో కలిసి తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన తిలక్ వర్మ.. క్రీజులో సెట్ అయిన తర్వాత భారీ షాట్స్ ఆడాడు. మరోవైపు నెహాల్ వధేరాను ముఖీమ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆయుష్ బదోని(2) నిరాశపర్చగా.. రమణ్‌దీప్ సింగ్‌తో కలిసి తిలక్ వర్మ హాఫ్ సెంచరీ దిశగా సాగాడు. కానీ అతన్ని జమాన్ ఖాన్ ఔట్ చేశాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన నిషాంత్ సింధు(6), అన్షుల్ కంబోజ్(0), రమణ్‌దీప్ సింగ్(17) దూకుడుగా ఆడే క్రమంలో వెనుదిరిగారు. క్రీజులోకి వచ్చిన రాహుల్ చాహర్ ఓ బౌండరీ బాదగా.. రసిక్ సలామ్ సిక్సర్ బాదాడు. దాంతో 200 ప్లస్ రన్స్ చేస్తుందనుకున్న భారత్-ఏ 183 పరుగులకు పరిమితమైంది.