ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024కి రంగం సిద్దమైంది. సంప్రదాయానికి భిన్నంగా ఇంటర్నేషనల్ స్టార్స్‌తో అభిమానులను అలరించనుంది. ప్రతీ ఏడాది జరిగే దులీప్ ట్రోఫీలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ జట్లు తలపడుతాయి. కానీ ఈసారి భారత అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఏ,బీ,సీ, డీ జట్లను భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.
వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుండటంతో రెడ్ బాల్ క్రికెట్‌కు కుర్రాళ్లను సంసిద్దం చేయాలనే లక్ష్యంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీని ఎలాంటి నాకౌట్ మ్యాచ్‌లు లేకుండా రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనుంది. ప్రతీ జట్టు తమ ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.

కన్నేసిన సెలెక్టర్లు..
అన్ని మ్యాచ్‌లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు విజేతగా నిలుస్తోంది. ఒక్కో మ్యాచ్ నాలుగు రోజుల పాటు జరగనుంది. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఈ టోర్నీలోని ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేస్తామని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. దాంతో ఈ టోర్నీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సెప్టెంబర్ 5(గురువారం)న ఇండియా ఏ వర్సెస్ ఇండియా బీ, ఇండియా సీ వర్సెస్ ఇండియా డీ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లతో ఈ టోర్నీకి తెరలేవనుంది. ఇండియా ఏ జట్టుకు టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
తుది జట్టు ఎలా..?
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో పాటు రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, మయాంక్ అగర్వాల్, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణలు ఈ జట్టులోనే ఉన్నారు. మొత్తం 16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో బరిలోకి దిగే 11 మంది ఎవరా? అనేది ఆసక్తికరంగా మారింది.
మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. అతనికి జతగా ఆడే ఆటగాడు ఎవరా? అనేదానిపై స్పష్టత లేదు. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ మూడు, నాలుగు స్థానాల్లో ఆడనున్నారు. టెస్ట్‌ల్లో ఈ ఇద్దరూ మిడిలార్డర్‌లోనే ఆడుతున్నారు. యశస్వి జైస్వాల్ రాకతో గిల్.. ఫస్ట్ డౌన్‌కు డిమోట్ అయ్యాడు.
రియాన్ పరాగ్ X తనూష్ కోటియన్
23 ఏళ్ల శస్వాత్ రావత్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత రంజీ ట్రోఫీలో బరోడా తరఫున అతను అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో వికెట్ కీపింగ్ చేసిన ధ్రువ్ జురెల్.. దులిప్ ట్రోఫీలోనూ కీపర్‌గా ఆడనున్నాడు. టీమిండియా సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న అతనికే ప్రాధాన్యత దక్కనుంది.
తిలక్ వర్మ, రియాన్ పరాగ్, శివమ్ దూబేల్లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కనుంది. ఈ ముగ్గురిలో తిలక్ వర్మకే మెరుగైన బ్యాటింగ్ రికార్డ్ ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే అతను ఐదో స్థానంలో బరిలోకి దిగవచ్చు. కుల్దీప్ యాదవ్, ముంబైకి చెందిన తనూష్ కోటియన్ స్పిన్నర్లుగా ఆడనున్నారు.
రియాన్ పరాగ్‌ను ఆడించాలని భావిస్తే.. తనూష్ కోటియాన్ స్థానంలో అవకాశం అందుకోనున్నాడు. పేసర్లుగా ప్రసిధ్ కృష్ణతో పాటు ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్ బరిలోకి దిగనున్నారు. దాంతో ఖలీల్, కావేరప్ప బెంచ్‌కే పరిమితం కానున్నారు.
ఇండియా ఏ తుది జట్టు( అంచనా) వర్సెస్ ఇండియా బి:
మయాంక్ అగర్వాల్, శస్వాత్ రావత్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, తనూష్ కోటియన్/రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ
ఇండియా ఏ: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్ర, శస్వాత్ రావత్.