మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో రాధా యాదవ్ సారథ్యంలోని భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం బ్యాంకాక్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్-ఏ జట్టు 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఏ టీమ్‌ను చిత్తు చేసింది. భారత మిడిలార్డర్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్(34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. బౌలింగ్‌లో ప్రేమ్ రావత్(3/12) మూడు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులే చేసింది. తేజల్ అజేయ హాఫ్ సెంచరీతో పాటు కెప్టెన్ రాధా యాదవ్(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహిమాన్ ఖాటున్(4/25) నాలుగు వికెట్లు తీయగా.. జహన్, ఫర్జానా చెరో వికెట్ తీసారు.

అనంతరం బంగ్లాదేశ్ 19.1 ఓవర్లలో 88 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. షమీమా సుల్తానా(15 బంతుల్లో 3 ఫోర్లతో 20) టాప్ స్కోరర్‌గా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రేమ్ రావత్(3/12) మూడు వికెట్లు తీయగా.. సోనియా మెంధియా, తనుజా కన్వర్ రెండేసి వికెట్లు తీయగా.. సైమా ఠాకూర్, రాధా యాదవ్ తలో వికెట్ తీసారు.
యూఏఈ చేతిలో ఘోర పరాయంతో ఈ టోర్నీని ప్రారంభించిన భారత్.. ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్-ఏ, నెపాల్‌లను ఓడించి సెమీఫైనల్ చేరింది. తొలి సెమీఫైనల్లో శ్రీలంక ఏ జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్-ఏ జట్టుకు దక్కే ప్రైజ్‌మనీ వివరాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పురుషుల ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో విజేతగా నిలిచిన పాకిస్థాన్ షాహీన్ జట్టుకు భారత కరెన్సీ ప్రకారం రూ. 17 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. మహిళల జట్టుకు కూడా ఇంతే ప్రైజ్‌మనీ దక్కే ఛాన్స్ ఉంది.