
హమిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెంచరీతో చెలరేగిన టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. లవ్ యూ స్మృతి అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే సెంచరీ చేసి విజయంలో కీలక పాత్ర పోషించినదాని కంటే.. మ్యాచ్ అనంతరం మంధాన చేసిన పనికే ఫిదా అవుతున్నారు. వెస్టిండీస్ మహిళలతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన మిథాలీ సేన 155 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన(119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 123), హర్మన్‌ప్రీత్ కౌర్(107 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109)సెంచరీలతో కదం తొక్కారు. 78 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును ఈ ఇద్దరు ఆదుకున్నారు. సూపర్ బ్యాటింగ్‌తో నాలుగో వికెట్‌కు 184 పరుగులు జోడించి భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ క్రమంలోనే హయ్యెస్ట్ స్కోర్‌గా నిలిచిన స్మృతి మంధానకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించగా.. ఆమె దాన్ని హర్మన్‌ప్రీత్‌తో కలిసి పంచుకుంది. ఇతరుల క్రెడిట్‌ను తమదని చెప్పుకునే ఈ రోజుల్లో స్మృతి మంధాన తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను సహచర ప్లేయర్‌తో పంచుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంధాన గొప్ప మనసును కొనియాడుతున్నారు. ఇద్దరం కలిసే భారీ స్కోర్‌కు బాటలు వేసామని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇద్దరికి దక్కాలని ఈ సందర్భంగా స్మృతి మంధాన వ్యాఖ్యానించింది.
'సెంచరీ చేసిన తర్వాత కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాకుంటే అది ఏ మాత్రం బావ్యం కాదనేది నా ఫీలింగ్. మా టీమ్ 300 ప్లస్ రన్స్ చేయడంలో మేం ఇద్దరం(హర్మన్ ప్రీత్) కీలక పాత్ర పోషించాం. సమానంగా రాణించాం. కాబట్టి ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇద్దరికి దక్కాలి. అందుకే ఈ ట్రోఫీని హర్మన్‌తో కలిసి పంచుకోవాలనుకుంటున్నా. మేం మా తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. మరోసారి వాటిని రిపీట్ చేయం. బ్యాటర్స్‌గా ఇద్దరం చేజింగ్, టార్గెట్‌లను సెట్ చేయడం బాగా ఇష్టపడుతాం. గత మ్యాచ్‌లో మేం విఫలమయ్యాం. మా ఇద్దరి మాలం వేర్వేరు. హర్మన్ స్పిన్ బాగా ఆడితే నేను పేస్ ఆడుతాను'అని మంధాన చెప్పుకొచ్చింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. స్నేహ్ రాణా(3/22) బంతితో తీన్మార్ వేయడంతో 40.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్ష్యచేధనలో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన విండీస్.. 12 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసి భారత బౌలర్లను బెంబేలెత్తించింది. ఆ జట్టు ఓపెనర్లు డియాంద్ర డాటిన్(46 బంతుల్లో 10 ఫోర్లు సిక్స్‌తో 62), హేలే మాథ్యూస్(36 బంతుల్లో 6 ఫోర్లతో 43) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు.
వీరి ఆరంభం చూసి విండీస్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ డాటిన్‌ను ఔట్ చేసి స్నేహ్ రాణా మ్యాచ్‌ను టర్న్ చేసింది. ఆమెకు తోడుగా మేఘన సింగ్ రెండు వికెట్లు తీయగా.. జులాన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ తీశారు. మరో ఇద్దరిని రనౌట్ చేశారు. 60 పరుగుల వ్యవధిలోనే విండీస్ 10 వికెట్లు కోల్పోవడం గమనార్హం.