IND-W vs WI-W: స్నేహ్ రాణా తీన్మార్.. విండీస్ బేజార్! మిథాలీ సేన గ్రాండ్ విక్టరీ!

హమిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ మరో విజయాన్నందుకుంది. వెస్టిండీస్ మహిళలతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన మిథాలీ సేన 155 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 123), హిట్టర్ హర్మన్‌ప్రీత్ కౌర్(107 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109)సెంచరీలతో కదం తొక్కారు.
విండీస్ బౌలర్లలో అనిసా మొహమూద్ రెండు వికెట్లు తీయగా.. మాథ్యూస్, షెకెరా, డియాండ్రా, అలెన్ తలో వికెట్ పడగొట్టారు. 78 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును స్మతి మంధాన, హర్మన్ ప్రీత్ ఆదుకున్నారు. సూపర్ బ్యాటింగ్‌తో నాలుగో వికెట్‌కు 184 పరుగులు జోడించారు.

60 పరుగులు.. 10 వికెట్లు..
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. స్నేహ్ రాణా(3/22) బంతితో తీన్మార్ వేయడంతో 40.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్ష్యచేధనలో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన విండీస్.. 12 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసి భారత బౌలర్లను బెంబేలెత్తించింది. ఆ జట్టు ఓపెనర్లు డియాంద్ర డాటిన్(46 బంతుల్లో 10 ఫోర్లు సిక్స్‌తో 62), హేలే మాథ్యూస్(36 బంతుల్లో 6 ఫోర్లతో 43) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు.
వీరి ఆరంభం చూసి విండీస్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ డాటిన్‌ను ఔట్ చేసి స్నేహ్ రాణా మ్యాచ్‌ను టర్న్ చేసింది. ఆమెకు తోడుగా మేఘన సింగ్ రెండు వికెట్లు తీయగా.. జులాన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ తీశారు. మరో ఇద్దరిని రనౌట్ చేశారు. 60 పరుగుల వ్యవధిలోనే విండీస్ 10 వికెట్లు కోల్పోవడం గమనార్హం.

వణికించిన ఓపెనర్లు..
318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మహిళలు.. టార్గెట్ తగ్గట్టుగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు డియాంద్ర డాటిన్, హేలే మాథ్యూస్ థనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగారు. ఆరంభం నుంచే భారత బౌలర్లపై వరుస బౌండరీలతో విరుచుకపడిన ఈ జోడీ.. జులాన్ గోస్వామి వేసిన ఐదో ఓవర్‌లో అయితే ఏకంగా ఐదు బౌండరీలు బాది 21 పరుగులు పిండుకుంది. దాంతో ఆ జట్టు ఐదు ఓవర్లకే 50 పరుగులు చేసింది.

12 ఓవర్లకే 100
మాథ్యూస్ ఇచ్చిన క్యాచ్‌ను తానియా భాటియా వదిలేయగా.. ఆ అవకాశాన్ని అందుకున్న ఆమె ధాటిగా ఆడింది. దీప్తి శర్మ వేసిన 10వ ఓవర్‌లో బౌండరీతో పాటు భారీ సిక్సర్ బాదిన డాటిన్ 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అనంతరం మరింత ధాటిగా ఆడటంతో 12 ఓవర్లలోనే విండీస్ 100 పరుగులు పూర్తి చేసుకుంది. దీంతో భారత్ విధించిన కొండంత లక్ష్యం విండీస్ ఈజీగా చేధిస్తుందని అంతా భావించారు. కానీ ఈ 100 పరుగుల భాగస్వామ్యానికి భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా తెరదించి.. భారత శిభిరంలో ఉత్సాహన్ని నింపింది.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
హాఫ్ సెంచరీతో జోరు మీదున్న డాటిన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. ఈ వికెట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కికియా నైట్(5), కెప్టెన్ టేలర్(1)లను మేఘన సింగ్ పెవిలియన్ చేర్చగా.. హాఫ్ సెంచరీకి చేరువైన హీలీ మాథ్యూస్(43)ను స్నేహ్ రాణా ఔట్ చేసింది. కీలక వికెట్లు రావడంతో భారత బౌలర్లు చెలరేగారు.
వరుస విరామాల్లో విండీస్ మహిళలను దెబ్బతీసారు. భారత బౌలర్ల ధాటికీ కాంప్ బెల్లే(11), చినెల్లే హెన్రీ(7), అనిసా మహమ్మద్, షమిలియా కాన్నెల్(1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో విండీస్ 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications