సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ టీమ్ జోరు కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో ఇప్పటికే టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీప్తి శర్మ(48 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్, 6/31) ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 28.2 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. ఆ జట్టులో చిన్నెల్లె హెన్రీ(72 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. కాంప్‌బెల్(62 బంతుల్లో 7 ఫోర్లతో 46) పర్వలేదనిపించింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్(4/29), దీప్తి శర్మ(6/31) విండీస్ పతనాన్ని శాసించారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 28.2 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. టాప్-3 బ్యాటర్లు స్మృతి మంధాన(4), ప్రతికా రవల్(18), హర్లీన్ డియోల్(1) విఫలమైనా.. హర్మన్‌ప్రీత్ కౌర్(22 బంతుల్లో 7 ఫోర్లతో 32), జెమీమా రోడ్రిగ్స్(45 బంతుల్లో ఫోర్‌తో 29), రిచా ఘోష్(11 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 23 నాటౌట్), దీప్తి శర్మ రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో డియాండ్రా డాటిన్, అలెన్, హీలీ మాథ్యూస్, కరిష్మా రామ్‌హరక్ తలో వికెట్ తీసారు. రిచా ఘోష్ వరుస సిక్సర్లతో విజయ లాంఛనాన్ని పూర్తి చేయడం గమనార్హం.
తొలి వన్డేలో 60 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. రెండో వన్డేలో 211 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి టీ20లో 49 పరుగులతో గెలిచిన టీమిండియా.. రెండో టీ20లో 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మూడో టీ20లో 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.