IND-W vs BAN-W: చెలరేగిన స్నేహ్ రాణా.. బంగ్లాపై భారత్ ఘనవిజయం! సెమీస్ ఆశలు సజీవం!

హమిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌తో చెలరేగిన మిథాలీ సేన 110 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫలితంగా సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడమే కాకుండా మెరుగుపరుచుకుంది. సౌతాఫ్రికా మహిళలతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోర్నీలో ముందడుగు వేస్తుంది. ఎందుకంటే మిథాలీ సేన భారీ విజయాలు సాధించడంతో మెరుగైన రన్ రేట్ ఉంది. దాంతోనే పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో నిలిచింది.

ఆదుకున్న యస్తికా భాటియా..
బంగ్లాతో మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 229 పరుగులు చేసింది. యస్తికా భాటియా(80 బంతుల్లో 2 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. పూజా వస్త్రాకర్(33 బంతుల్లో 2 ఫోర్లతో 30 నాటౌట్), షెఫాలీ వర్మ(42 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 42) పర్వాలేదనిపించారు.
స్నేహ్ రాణా(23 బంతుల్లో 2 ఫోర్లతో 27) విలువైన పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ మిథాలీ రాజ్(0), హర్మన్ ప్రీత్ కౌర్(14) దారుణంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రితు మోని మూడు వికెట్లు తీయగా.. నహిదా అక్తర్ రెండు, జహనరా అలామ్ ఓ వికెట్ పడగొట్టింది.

చెలరేగిన బౌలర్లు..
అనంతరం లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల ధాటికి 40.3 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ జట్టులో సల్మా ఖాటున్(32), లతా మోండల్(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వగా.. ఇందులో ఇద్దరు డకౌట్‌గా వెనుదిరిగాడు.
భారత బౌలర్లలో స్నేహ్ రాణా(4/30) నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. జులాన్ గోస్వామి(2/19), పూజావస్త్రాకర్(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు. పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ తలో వికెట్ తీసారు. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యస్తికా భాటియాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

ఆ ఒక్కటి గెలిస్తే..
మార్చి 27న సౌతాఫ్రికాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. ఎందుకంటే భారత్ ప్రస్తుతం మెరుగైన రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది.
టాప్-2లో ఉన్న ఆసీస్, సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖారారు చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి. తదుపరి మ్యాచ్‌లో భారత్ ఓడితే మాత్రం ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. గెలిస్తే మాత్రం నేరుగా సెమీఫైనల్ ఆడవచ్చు. వెస్టిండీస్‌ది అదే పరిస్థితి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications