
ముంబై: భారత మహిళల జట్టు సంచలన విజయాన్నందుకుంది. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు సూపర్ ఓవర్‌లో విజయాన్నందుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
ఇక సూపర్ ఓవర్‌లో రిచా ఘోష్, స్మృతి మంధాన విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మహిళలు రేణుకా సింగ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 16 పరుగులకే పరిమితమై ఓటమిపాలయ్యారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరోసారి బెత్ మూనీ(54 బంతుల్లో 13 ఫోర్లతో 82), తహిల మెక్‌గ్రాత్(51 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 70) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో దీప్తి శర్మకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులే చేసింది. స్మృతి మంధాన(49 బంతుల్లో 9 ఫోర్లతో 4 సిక్స్‌లతో 79) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. చివర్లో రిచా ఘోష్(13 బంతుల్లో 3 సిక్స్‌లతో 26 నాటౌట్) మెరుపులు మెరిపించింది.
స్మృతి మంధాన సూపర్ బ్యాటింగ్‌తో భారత్ సునాయస విజయాన్నందుకుంటుందని భావించినా.. ఆసీస్ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన సమయంలో 19వ ఓవర్ వేసిన హీథర్ గ్రహమ్ ఓ వికెట్ తీయడంతో పాటు నాలుగు పరుగులే ఇచ్చింది. దాంతో చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. బిగ్ హిట్టర్ రిచా ఘోష్ సింగిల్ తీసి దేవికా వైద్యకు స్ట్రైక్ ఇవ్వడంతో భారత్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు.
దేివికా వైద్య చివరి బంతికి బౌండరీ బాది ఓటమిని తప్పించింది. సూపర్ ఓవర్‌లోఆసీస్ ఫీల్డింగ్ తప్పిదం కూడా భారత్‌కు కలిసొచ్చింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధానకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. మూడో టీ20 బుధవారం జరగనుంది.