
మాక్కే: ఆస్ట్రేలియా గడ్డపై వరుస పరాజయాలకు చెక్ పెడుతూ ఎట్టకేలకు భారత మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియా మహిళలతో ఆదివారం జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో మిథాలీ సేన రెండు వికెట్లతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళలు సమష్టిగా రాణించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2తో ముగించింది. తొలి రెండు వన్డేల్లో గెలుపొందిన ఆస్ట్రేలియా ఆఖరి వన్డేలో మాత్రం ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేశారు.
ఆశ్లే గార్డ్‌నర్(62 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67), బెత్ మూనీ(64 బంతుల్లో 6 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించగాగగా.. తహిలా మెక్‌గ్రాత్(32 బంతుల్లో 7 ఫోర్లతో 47), అలిసా హీలీ(47 బంతుల్లో 2 ఫోర్లతో 35) విలువైన పరుగులు చేశారు. భారత మహిళా బౌలర్లలో జూలన్ గోస్వామి(3/37), పూజా వస్త్రాకర్(3/46) మూడేసి వికెట్లు తీయగా.. స్నేహ్ రాణాకు ఓ వికెట్ దక్కింది. ఇద్దరు బ్యాటర్లు రనౌటయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 8 వికెట్లకు 266 రన్స్ చేసి మూడు బంతులుండగానే విజయాన్నందుకుంది. యస్తిక భాటియా(69 బంతుల్లో 9 ఫోర్లతో 64), షెఫాలీ వర్మ(91 బంతుల్లో 7 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. దీప్తి శర్మ(31), స్నేహ్ రాణా(30) విలువైన పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సుదెర్లాండ్ మూడు వికెట్లు తీయగా.. తహిలా మెక్‌గ్రాత్, సోఫియా మోలినక్స్, అష్లే గార్డ్‌నర్, స్టెల్లా కాంప్‌బెల్, నికోలా కారీ తలో వికెట్ తీశారు.
మహిళల వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్‌లో మిథాలీ సేన తీవ్రంగా నిరాశపరిచింది. తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో చిత్తయిన మిథాలీ సేన.. రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫస్ట్ వన్డేలో పేలవ ప్రదర్శనతో ఓటమిపాలైన మిథాలీ సేన రెండో వన్డేలో విజయం ముంగిట బోల్తా కొట్టింది. చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 13 రన్స్ అవసరం కాగా జులన్ గోస్వామి నోబాల్ వేయడంతో విజయం చేజారింది. అయితే తాజా మూడో వన్డేలో గోస్వామి రివేజంజ్ తీసుకుంది.
ఇక మూడో వన్డేలో భారత మహిళల విజయం సాధించడంతో ఆస్ట్రేలియా మహిళల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 2018 మార్చి నుంచి వన్డేల్లో ఆ జట్టు ఓటమే ఎరుగలేదు. వరుసగా 26 వన్డేల్లో వరుసగా విజయం సాధించింది. తాజా విజయంతో ఈ రికార్డుకు భారత మహిళలు బ్రేక్ వేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళలు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లతో పాటు ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు.