ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలే తమ ఓటమిని శాసించాయని జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా అన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సికందర్ రాజా.. మళ్లీ ఫీల్డింగ్‌లోనే తప్పిదాలు చేశామని చెప్పాడు.
'మళ్లీ ఫీల్డింగ్‌లోనే తప్పిదాలు చేశాం. వాస్తవానికి మా బలమే ఫీల్డింగ్. కానీ ఈ రోజు స్థాయికి తగ్గట్లు ఫీల్డింగ్ చేయలేకపోయాం. దాంతో అదనంగా 20 పరుగులు ఇచ్చుకున్నాం. చివరకు 23 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యాం. మా టాపార్డర్ బ్యాటింగ్‌లోనూ సమస్యలున్నాయి. కానీ మా టాపార్డర్ బ్యాటర్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే వారు సత్తా చాటుతారు. గతేడాదిగా టాపార్డర్‌లో మేం 15 మంది ఓపెనింగ్ జోడీలను ప్రయత్నించాం.
దేశంలో చాలా క్రికెట్ టోర్నీలు జరుగుతున్నాయి. క్లబ్ క్రికెట్ పుంజుకుంది. నాతో సహా మా ఆటగాళ్లు బాధ్యతగా ఆడాల్సిన సమయం ఇది. కుర్రాళ్లు తప్పలు చేయడం సహజమే. కానీ సీనియర్ ప్లేయర్లు బాధ్యత తీసుకోవాలి. సమస్యను పరిష్కరించేందుకు మరో సమస్యను సృష్టించవద్దు. అందుకే మేం ముగ్గురు ఓపెనర్లను తీసుకున్నాం. ఓపెనర్లు పరుగులు చేయాలి. ముజరబని అసాధారణ ఆటగాడు. కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు రావు. కానీ సుదీర్ఘ ప్రయాణంలో రావాల్సినప్పుడు రివార్డ్స్ దక్కుతాయి.'అని సికందర్ రాజా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని(2/25), సికందర్ రాజా(2/24) రెండేసి వికెట్లు తీసారు. అనంతరం జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసి ఓటమిపాలైంది. డియోన్ మైర్స్(40 బంతుల్లో 5 ఫోర్లతో 43 నాటౌట్), క్లైవ్ మదండే(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/15) వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్(1/15) ఓ వికెట్ తీసాడు.