
ఫ్లోరిడా: వేదిక మారినా వెస్టిండీస్ ఆట తీరు మాత్రం మారలేదు. భారత్‌తో నాలుగో టీ20లో విండీస్ ఓటమి దిశగా సాగుతోంది. భారత బౌలర్లు చెలరేగడంతో 101 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. షిమ్రాన్ హెట్‌మైర్(7 బ్యాటింగ్), అకీల్ హోస్సెన్(0 బ్యాటింగ్)తో కలిసి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోర్ చేసింది.
రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 44) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. రోహిత్ శర్మ((16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33), సంజూ శాంసన్(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో అక్షర్ పటేల్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెక్‌కాయ్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల హోసెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన విండీస్‌కు రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. బ్రాండన్ కింగ్(13)ను ఆవేశ్ ఖాన్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత డేవాన్ థామస్, నికోలస్ పూర్(24), కైల్ మేయర్స్(13), రోవ్‌మన్ పొవెల్ (24) కూడా దారుణంగా విఫలమయ్యారు. జాసన్ హోల్డర్(13) కూడా చేతులెత్తేయడంతో విండీస్ కోలుకోలేకపోయింది. వరుస ఓవర్లలో స్టార్ బ్యాటర్లంతా వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో కూరుకుపోయింది.
ఈ మ్యాచ్‌తో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది రికార్డును అధిగమించాడు. విండీస్‌తో మూడు సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్.. అన్ని ఫార్మాట్లలో సిక్సర్ల సంఖ్యను 477కు పెంచుకున్నాడు. ఈ జాబితాలో విండీస్ విధ్వంసకర యోధుడు, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో 553 సిక్సర్లు బాదిన గేల్ పేరిట అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదై ఉంది. గేల్ తర్వాత రోహిత్(477) ఉండగా.. అఫ్రిది(476) మూడో స్థానానికి పరిమితమయ్యాడు.